మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో ఎన్ని అవమానాలకు గురిచేసినా అధైర్య పడలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబుకు ధైర్యం చాలా ఉందని.. ఆయనకు భయం లేదని పవన్ కొనియాడారు. చంద్రబాబు ఓపిక తనను ఆశ్చర్యపరుస్తుందని.. పాతికేళ్ల యువకుడు కూడా చంద్రబాబులా కష్టపడలేరని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం బురదలో దిగి నడుస్తుంటే.. వైసీపీ విమర్శలు చేస్తుందని.. ఆయన చేసే మంచి పనులను గుర్తించి తాము అండగా ఉంటామని పవన్ కల్యాణ్ చెప్పారు.
చంద్రబాబులో భయం లేదు. అపారమైన అనుభవం ఉంది. బాబు తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు.. చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని అవమానపరిచారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు ఆయన్ని బలి చేశారు. రాజమండ్రి జైల్లో కలిసినప్పుడు ఆయన గుండె ధైర్యాన్ని చూశా. బాబులో ఆత్మస్థైర్యం ఏనాడూ దెబ్బతినలేదు. పాలన ఎలా ఉండాలో బాబు పక్కనే ఉండి నేర్చుకోవాలనుకున్నా. జైల్లో ఉన్నప్పుడు నేను సినిమా షూటింగులకు కూడా వెళ్లలేదు. షూటింగ్‌కు రావాలని ప్రొడ్యూసర్లు అడిగినా నేను రానని చెప్పా. విభజన కాలం నుంచి జగన్ పాలన వరకు రాష్ట్రం నలిగిపోతూనే ఉంది. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని పవన్ తెలిపారు.
మేము పైకి మూడు వేర్వేరు పార్టీలు అయినప్పటికీ, మా గుండెల్లో మోగేది ఒకటే చప్పుడని పవన్ అన్నారు.మూడు భిన్నమైన పార్టీలకి ఆత్మ ఒక్కటే.మూడు పార్టీలు ఏకతాటిపై ముందుకెళ్లి రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని పవన్ ఆకాంక్షించారు. ఏపీలో పింఛన్లు పెంచేందుకు కూడా ఎంతో తర్జన భర్జన పడ్డామని.. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచామని పవన్ అన్నారు. సీఎం చంద్రబాబు దార్శనికతతోనే ఇదంతా సాధ్యం అయ్యిందని చెప్పారు. చంద్రబాబు తనను అనునిత్యం తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని.. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని చెప్పారు.