వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అక్కినేని..ఎస్వీఆర్ అభిమానులు బాలయ్య వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలగాజనం అంటూ ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేసిన బాలయ్య ఇప్పుడు అక్కినేని కుటుంబంపై కామెంట్స్ చేశారు. ఆ ఫ్యామిలీని కించపరిచేలా మాట్లాడారు. బాలకృష్ణ ఫ్లోలో అన్నారో లేక.. ఉద్దేశపూరకంగా చెప్పారో గానీ.. అక్కినేని కుటుంబం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అక్కినేని.. తొక్కినేని అంటూ, . తొలితరం దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పేరును కూడా ప్రస్తావించారు. మా ఆర్టిస్టులు అంత నాకు మంచి టైమ్ పాస్, వేదాలు శాస్త్రాలు నాన్నగారు, ఆ రంగారావు ఈ రంగారావు, అక్కినేని తొక్కినేని.. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకునేవాళ్లమని అన్నారు. అయితే అక్కినేని నాగేశ్వర రావు వర్ధంతి నాడే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కామెంట్లపై అక్కినేని అభిమానులు అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. బాలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా నిన్న ట్వీట్లు చేశారు. కానీ అక్కినేని నాగార్జున ఇప్పటివరకు స్పందించకపోవడంపై ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
అక్కినేని గురించి నోరు జారిన బాలయ్య సంస్కారాన్ని ఆయన విజ్ఞతకే వదిలేసేలా నాగ్ మౌనం పాటిస్తున్నారు అని మరికొందరు అంటున్నారు. మరోవైపు బాలయ్యకి, నాగార్జునకి తేడా ఇది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఓ వీడియో వైరల్ చేస్తున్నారు. బంగార్రాజు సక్సెస్ ఈవెంట్ లో నాగార్జున .. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ‘చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు ఎన్టీఆర్, ఏఎన్నార్.. నేడు ఎన్టీఆర్ గారి వర్ధంతి.. చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఆయన్ని గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ లివ్స్ ఆన్.. ఏఎన్నార్ లిప్స్ ఆన్.. అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ని నాగార్జున అంత గౌరవించగా, ఇప్పుడు బాలయ్య అలా మాట్లాడడం సరికాదని కొందరు పెద్దలు అంటున్నారు. బాలకృష్ణ-నాగార్జున మధ్య అభిప్రాయబేధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో తను స్పందిస్తే, వివాదం మరింత ముదురుతుందనే భావనతో నాగార్జున వెనక్కితగ్గినట్టు టాక్.