Baba Ramdev : ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వివాదంలో చిక్కుకున్నారు. మహిళల వస్త్రధారణపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా రాందేవ్ మైక్ అందుకుని మహిళల్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు చీరలో బాగుంటారు, సల్వార్ సూట్స్‌లో కూడా బాగుంటారు.
ఇంకా చెప్పాలంటే నా కంటికైతే అసలేం ధరించకపోయినా అందంగానే కనిపిస్తారంటూ బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి భార్య, ఇతర ప్రముఖులు, వందలాది మంది మహిళల సమక్షంలో బాగా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై నెటిజన్లు, మహిళా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నారు. తక్షణం మహిళా లోకానికి బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాబా రాందేవ్ ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు. యోగా సైన్స్ శిబిరానికి మహిళలు యోగా డ్రస్సుల్లో వచ్చారు.
అదే రోజు శిబిరం, యోగా శిక్షణా కార్యక్రమం జరగడంతో వారు చీరలు ధరించేందుకు సమయం లేకపోయింది. ఈ పరిస్ధితిపై మాట్లాడాలనుకున్న బాబా రాందేవ్ ఏదో చెప్పాలనుకుని, ఇలా నోరు జారారు. మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఈ క్రమంలో యోగా గురు రాందేవ్ బాబా సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబా రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. బాబా రాందేవ్ తన నైజాన్ని బయటపెట్టారని ఆగ్రహిస్తున్నారు.