Kantara : కాంతార.. ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరుగుతోంది. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అక్టోబర్ 15న విడుదల చేశారు. థియేటర్లలో విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఇటీవలే 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ కన్నడ బ్లాక్‌బస్టర్ కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా చుట్టూ ఉన్న ఒకేఒక్క వివాదానికి తాజాగా తెరపడింది.
ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచిన వరాహ రూపం పాట సినిమాలో ప్రదర్శించరాదంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కేరళ హైకోర్టు బుధవారం కొట్టేసింది. దీంతో.. కాంతార సినిమాకు ఓటీటీలో విడుదలయ్యే కొద్ది గంటల ముందు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. కాంతార సినిమాలో బాగా పాపులర్ అయిన వరాహ రూపం పాటను థియేటర్లలో ప్రదర్శించరాదంటూ కేరళ కోర్టు గతంలో తీర్పునిచ్చింది. తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా ఆ పాటను థియేటర్లలో ప్రదర్శించకూడదని కొజికొడె జిల్లా సెషన్స్ జడ్జ్ తీర్పునిచ్చారు. చిత్ర నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, అమెజాన్, యూట్యూబ్, స్పాటిఫై, వింక్ మ్యూజిక్, జియోసావన్.. ఈ ఫ్లాట్‌ఫామ్స్ ఏవీ తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ అనుమతి లేకుండా పాటను ప్లే చేయకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది.
అక్టోబర్ 24న తైకుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఇన్‌స్టాగ్రాం పేజ్ వేదికగా కాంతార సినిమా మేకర్స్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి తమ నవరసం అనే పాట నుంచి వరాహ రూపం అనే పాటను కాపీ చేసి సినిమాలో వాడుకున్నారని ఆరోపించింది. కాంతార సినిమా యూనిట్ తమను సంప్రదించకుండా పాటను కాపీ చేయడంపై న్యాయపరంగా తేల్చుకుంటామని తైకుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ యాజమాన్యం కోర్టుకెక్కింది. ఎట్టకేలకు వరాహ రూపం సినిమాపై నెలకొన్న ఈ వివాదంపై కాంతార చిత్ర బృందానికి అనుకూలంగా తీర్పు రావడంతో వివాదం సమసిపోయినట్టే కనిపిస్తోంది.