Prakash Raj : ప్రకాష్ రాజ్ విలక్షణ పాత్రలకు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. తెలుగు, తమిళ భాషల్లో విలక్షణమైన విలనిజానికి సరికొత్త సొబగులద్దిన ప్రకాష్ రాజ్ కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో వుందా? అంటే ఆయన అవునంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనతో కలిసి నటించడానికి ఇతర నటీనటులు వెనకాడుతున్నారని ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతకొంత కాలంగా క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ సోషల్ మీడియా వేదికగా ప్రతీ అంశంపై జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
బెంగళూరుకు చెందిన ప్రముఖ పాత్రికుయురాలు గౌరీ లంకేష్ హత్య తరువాత ప్రకాష్ రాజ్ బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా ఓ ఆంగ్ల మీడియా ఛానల్ తో ముచ్చటించిన ప్రకాష్ రాజ్ తన కెరీర్ పై రాజకీయాల ప్రభావం పడుతున్నట్టుగా అనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొందరు నాతో కలిసి పని చేయటం లేదు. నాతో కలిసి పనిచేస్తే వారిని జనాలు అంగీకరించేరేమోననే భయం కొంతమందిలో పట్టుకుంది. అలాంటి వాళ్లు నాకు దూరమైతేనే మంచిదని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
నేను ఈ విషయంలో కొంచెం కూడా బాధపడటం లేదు. కొన్ని విషయాలకు నేను వ్యతిరేకంగా మాట్లాడాలి. లేదంటే కేవలం మంచి నటుడిగానే నేను చనిపోతాను. నాకు అలా చనిపోవాలని లేదని ప్రకాష్ రాజ్ తన ఉద్దేశం తెలియజేశారు. ప్రకాష్ రాజ్ చాలాకాలంగా బీజేపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు. ఇదే ఆయన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రకాష్ రాజ్ చెప్పారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్న నేను మోడీని ప్రశ్నించడం ఆపను అని స్పష్టంగా చెప్పారాయన. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నుండి ప్రకాష్ రాజ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.