T20 World Cup 2022 : ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొదటి సెమిఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ సునాయాసంగానే ఛేదించింది. దీంతో పాక్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే 2007 సెంటిమెంట్ రిపీట్ అయింది. అప్పుడు నిర్వహించిన టీ20 ప్రపంచ కప్‌లోనూ ఒక సెమి ఫైనల్‌లో పాక్, కివీస్ తలపడగా.. పాక్ నెగ్గింది. తరువాత ఇంకో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై నెగ్గిన భారత్‌తో పాక్ ఫైనల్స్ ఆడింది. ఫైనల్స్ మాత్రం భారత్ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఇంకో సెమి ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా కాకుండా ఇంగ్లండ్ ఉండడం విశేషం. ఈ క్రమంలోనే కివీస్‌పై పాక్ గెలవడంతో సెంటిమెంట్ రిపీట్ అయిందని అంటున్నారు.
ఇలా పాక్ గెలవడం వల్ల భారత్ కూడా ఇంగ్లండ్‌పై గెలిస్తే.. అప్పుడు పాక్, భారత్ ఫైనల్స్‌లో ఆడతాయి. దీంతో భారత్ ఫైనల్స్‌లో గెలుస్తుందని.. సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవడం ఖాయమని అంటున్నారు. కాగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో డారిల్ మిచెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. మరో బ్యాట్స్‌మన్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 42 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆకట్టుకోలేదు. అలాగే పాక్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 2 వికెట్లు తీయగా, మహమ్మద్ నవాజ్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. బ్యాట్స్‌మెన్ పరుగుల వేటలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కివీస్ బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలం అయ్యారు. దీంతో పాక్ లక్ష్యాన్ని సునాయాసంగానే ఛేదించింది. మ్యాచ్ వన్ సైడెడ్‌గానే మారింది. 19.1 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయిన పాకిస్థాన్ 153 పరుగులు చేసి విజయం సాధించింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్లు రాణించారు. మహమ్మద్ రిజ్వాన్ 43 బంతుల్లో 5 ఫోర్లతో 57 పరుగులు చేయగా.. ఇంకో ఓపెనర్ బాబర్ అజమ్ 42 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. ఇంకో బ్యాట్స్ మన్ మహమ్మద్ హారిస్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 30 పరుగులు రాబట్టాడు. ఇక కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌కు 2 వికెట్లు దక్కగా, మిచెల్ శాన్టనర్ 1 వికెట్ తీశాడు. ఈ విజయంతో ఫైనల్స్‌కు వెళ్లిన పాక్ రేపటి మ్యాచ్‌లో విజేతతో ఆడుతుంది. అయితే భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగే ఈ పోరులో భారత్ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.