మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ రిజల్ట్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలో కూడా అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా మెగా అభిమానులకు అయితే ఇదొక పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తీవ్ర నిరాశ మిగిలింది. అయితే ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవాలు అన్నీ కావు. ఓటీటీలో విడుదలైనా కూడా ఈ సినిమా అక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ లేకుండా పోయింది. ఇక శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ భారీ రేటుకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే మొదటిసారి ఇటీవల జెమినీ టీవీలో ఆచార్య సినిమాను టెలికాస్ట్ చేయగా అతి తక్కువ స్థాయిలో రేటింగ్స్ అందుకుంది.
సీనియర్ హీరోల్లో అక్కినేని నాగార్జున బంగార్రాజు సినిమా మొదటిసారి ప్రసారమైనప్పుడు 14 టీఆర్పీ అందుకుంది. ఇక బాలకృష్ణ అఖండ సినిమా 13.31 టీఆర్పీ అందుకుంది. ఆఖరికి వెంకటేష్ ఎఫ్2 సినిమా 8కి పైగా టీఆర్పీ రేటింగ్ అందుకోగా ఇప్పుడు ఆచార్య సినిమా అంతకంటే తక్కువ స్థాయిలో 6.30 టీఆర్పీ రేటింగ్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కొందరు ఇప్పుడు దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో రానుండగా.. మరోవైపు చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.