Super Star Krishna : డేరింగ్ అండ్ డైనమిక్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నటన మీద ఆసక్తితో 1965 లో తేనెమనసులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణ. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలు సెన్సేషనల్ హిట్ గా నిలిచేవి. తెలుగుతెరకు తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ చిత్రాలను పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ. ఈస్ట్ మన్ కలర్ ను కూడా పరిచయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. అందుకే తెలుగులో ప్రతి కొత్తధనానికి శ్రీకారం చుట్టింది కృష్ణగారే అని ఆయనను సినీ అభిమానులు ముద్దుగా నంబర్ వన్ హీరో అని పిలుచుకుంటారు.
అప్పటిలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్ద హీరోలను ఢీ కొడుతూ ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించేవి. దాదాపుగా 350 చిత్రాల్లో నటించడమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కృష్ణ అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు హీరోగా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
కానీ ఇంత గొప్ప నటుడు కెరిర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారట. నువ్వు హీరోగా పనికిరావు అని చాలామంది అన్నారట. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణ ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు. తాను మొదట్లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నాను అని చెప్పారు కృష్ణ. అయితే ఒకానొక సమయంలో కృష్ణకు వరుసగా 12 ప్లాప్స్ రావడంతో ఆయనను చాలామంది దర్శక నిర్మాతలు పక్కన పెట్టేసారట. ఇక నువ్వు హీరోగా పనికిరావు అంటూ కృష్ణాపై కామెంట్స్ చేసారట. ఆ సమయంలో ఏం చేయాలో అర్ధం కానీ పరిస్థితుల్లో పడిన కృష్ణ.. తన తమ్ముడు ఆదిశేషగిరిరావు ఘట్టమనేని నిర్మాతగా చేస్తూ సొంత బ్యానర్ అయినా పద్మాలయ ఆర్ట్ పిక్చర్స్ లో పాడి పంటలు అనే సినిమా తీశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి కృష్ణగారిని మళ్ళీ తిరిగి హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన సినీ కెరీర్ లో వెన్నకి తిరిగి చూసుకోలేదు అని కృష్ణ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.