Sonu Sood : భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం, వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకంగా రూ. 6కోట్ల భారీ విరాళంతో ఉదారత చాటారు. ఇందులో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి ప్రకటించిన జనసేనాని.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ.కోటి ఇచ్చారు. అలాగే ఏపీలో వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ.1లక్ష చొప్పున రూ.4 కోట్లు ఇస్తానన్నారు.
ఇలా విపత్కర పరిస్థితుల్లో గొప్ప మనసు చాటిన పవన్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వరద ప్రాంత ప్రజల కోసం భారీ విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎంను అభినందించారు. ఇక ప్రముఖ నటుడు సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు.
ప్రజలు తమ తమ సహాయ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్‌కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్‌ను ఇచ్చారు. తద్వారా ఆయన సహాయం చేయడంతో పాటు తన చారిటీ ద్వారా వనరులను సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలో వరద భీబత్సానికి తీవ్ర నష్టం జరిగిన ప్రజలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర టీమ్ తగు చర్యలు తీసుకోవడం పట్ల జాతీయ నటుడు సోనూసూద్ హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొద్దిరోజులు ప్రజలు ఇల్లు కోల్పోయి తిండికి కూడా ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వాలు హెల్ప్ చేస్తున్నాయి. వరదలు రావడం విచారకరం. అందుకే త్వరలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. నా టీమ్ కూడా ప్రజలకు తగిన సేవ చేస్తున్నారు. త్వరలో మీముందుకు వచ్చి మీకు కావాల్సిన సాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇందుకు మీరు supportus@soodcharityfountion.orgలో మమ్మల్ని చేరుకోండి. మాకు తగినవిధంగా మెయిల్ చేస్తే మాటీమ్ కానీ, నేనే స్వయంగా వచ్చి మీకు తగు సాయం చేస్తానని వీడియో విడుదల చేశారు.