Karthikeya 2 : ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో పెద్ద సినిమాలకు కూడా ఆదరణ కరువైన విషయం తెలిసిందే. చిరంజీవి, నాగార్జున వంటి హీరోల సినిమాలే బాక్సాఫీస్ వద్ద కుదేలవుతున్నాయి. అలాంటి సమయంలో సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు నిఖిల్. చందూ మొండేటి డైరెక్షన్లో 2014లో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి సీక్వెల్‌గా కార్తికేయ 2ను తెరకెక్కించారు. తొలి రోజు నుండే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది ఈ చిత్రం. ప్రస్తుతం అంచనాలకు మించి దేశవ్యాప్తంగా కలెక్షన్స్ ను రాబడుతుంది.
డైరెక్టర్ చందూ మొండేటి-నిఖిల్ సిద్ధార్థ్ కాంబినేషన్లో రెండోసారి తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఈ మూవీని బాలీవుడ్లో హిట్ కొట్టిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీకి ఒక నిర్మాత అయిన అభిషేక్ అగర్వాల్‌తోపాటు టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్ర పోషించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.56 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలంగాణ, ఏపీల్లో మొత్తం రూ.32.35 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.56 కోట్ల షేర్ ను వసూలు చేసింది. దీంతో కార్తికేయ 2 రికార్డులను తిరగరాసిందని చెప్పవచ్చు.