YS Sharmila : కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనున్న విషయం తెలిసిందే. నిశ్చితార్థం వేడుక జనవరి 18న జరగనుంది. ఈ మేరకు వైఎస్ షర్మిల వివాహ సన్నాహాలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలను పెళ్లికి ఆహ్వానిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం . దీనిలో భాగంగా ఇటీవలే తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గవర్నర్ తమిళిసై, మాజీ మంత్రి హరీష్ రావు, తదితరులను ఇప్పటికే ఆహ్వానించారు.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా వైఎస్ షర్మిల ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. గంటకు పైగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో చంద్రబాబుతో చర్చించారు. ఆ తర్వాత వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. ఎక్కువగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుకున్నామని తెలిపారు. రాజకీయాలు మాట్లాడుకోలేదని తెలిపారు. తాను, వైఎస్ కాంగ్రెస్ నుంచి కలసి చేసిన ప్రయాణంతో పాటు, ఆయనతో ఉన్న రాజకీయ అనుబంధం గురించి చంద్రబాబు గుర్తు చేసుకున్నారన్నారు.
రాజకీయాలు వృత్తి అని, పార్టీ నేతలందరికీ తాను క్రిస్మస్ రోజు కేక్ పంపామని, చంద్రబాబు కు పంపడంలో ప్రత్యేకత ఏమీ లేదని వైఎస్ షర్మిల తెలిపారు. కేటీఆర్, కవిత, హరీశ్‌రావులకు కూడా కేక్ పంపానని ఆమె చెప్పారు. చంద్రబాబును తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి మాత్రమే వెళ్లానని, రాజకీయాలు మాట్లాడుకోలేదని ఆయన అన్నారు. వైఎస్సార్ గురించి మాత్రమే చంద్రబాబు ప్రస్తావించారన్నారు. ఇది వింత కాదు.. విచిత్రం కాదని షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తాను చేస్తానని ఆయన తెలిపారు. చంద్రబాబుతో భేటీని రాజకీయంగా చూడొద్దని సూచించారు. చంద్రబాబు వేరే పార్టీ, నేను వేరే పార్టీ. ఆయనతో కలిసి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకులేదు.. రాదని షర్మిల అన్నారు. గతంలో మా పెళ్లిళ్లకు మాతండ్రి రాజశేఖర్ రెడ్డి అందరినీ ఆహ్వానించారని, ఆ సమయంలో చంద్రబాబుసైతం హాజరై మమ్మల్ని ఆశీర్వదించారని షర్మిల గుర్తు చేశారు.