కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. అనేక మందికి ఉపాధి కరువైంది. ఇక ఇప్పటికే సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారిని కూడా చాలా వరకు తొలగించారు. దీంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయించారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌కు బాగా అలవాటు పడిన కారణంగా ఇప్పుడు ఉద్యోగుల విధానంలో మార్పు వచ్చింది. జీతం తక్కువైనా ఇంటి నుంచే పనిచేస్తాం.. కానీ ఆఫీస్‌కు వెళ్లి ఒత్తిడిని పెంచుకోవడం ఇష్టం లేదని చాలా మంది ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో కంపెనీలు ఒత్తిడి తెస్తున్నారు. ఆఫీస్ లకు రావాలని చెబుతున్నాయి.
అయితే కంపెనీల ఒత్తిడి మేరకు కొందరు తిరిగి ఆఫీస్ లకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం చస్తే ఆఫీస్‌కు వెళ్లమంటూ అవసరం అయితే ఉద్యోగాలను కూడా మానేస్తున్నారు. అలాంటి వారు వ్యాపారాలను చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోని టాప్ ఐటీ కంపెనీల నుంచి భారీ ఎత్తున ఉద్యోగులు రాజీనామాలు చేశారు. వారిలో కొందరు సొంత ఉపాధి మార్గాలను వెతుక్కోగా.. కొందరు మాత్రం ఇంకాస్త మంచి ప్యాకేజీ ఇస్తే ఇతర కంపెనీలకు షిఫ్ట్ అవుదామని చూస్తున్నారు.
అయితే ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో మన దేశంలోని ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి 28.4 శాతం మంది రిజైన్ చేయగా.. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ టాప్ ప్లేస్‌లో ఉంది. తరువాత రెండో స్థానంలో హెచ్‌సీఎల్ నిలిచింది. అదే త్రైమాసికంలో హెచ్‌సీఎల్ నుంచి 23.8 శాతం మంది ఉద్యోగులు నిష్క్రమించారు. అలాగే విప్రో నుంచి 23.3 శాతం మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. అలాగే టీసీఎస్‌లో ఉద్యోగుల రాజీనామాల శాతం 19.7 గా ఉంది.
ఇక ఉద్యోగుల రాజీనామాలతో ఇప్పటికప్పుడు కంపెనీలకు వచ్చే నష్టమేమీ లేకపోయినా.. భవిష్యత్తులో దీని ప్రభావం తప్పక ఉంటుందని అంటున్నారు. సీనియర్ స్టాఫ్ వెళ్లిపోతే వచ్చే జూనియర్‌లు మళ్లీ ఆ స్థితికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో కంపెనీ వృద్ధి రేటు తగ్గుతుంది. ఇది కంపెనీలకు నష్టం కలిగించేదే. అయితే ఉద్యోగులను చేర్చుకుంటున్న వాటిల్లో టీసీఎస్, హెచ్‌సీఎల్ మాత్రం ముందు వరుసలో ఉన్నాయి. ఈ కంపెనీలు అధిక సంఖ్యలో రిక్రూట్‌మెంట్లను నిర్వహిస్తూ రాజీనామా చేస్తున్న ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ నష్టాన్ని భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
కానీ కరోనాకు ముందు పరిస్థితి ఇప్పుడు లేదని అంటున్నారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు సులభంగానే లభిస్తాయని అంటున్నారు. ఎందుకంటే స్కిల్డ్ ఉద్యోగులు చాలా మంది సొంత బిజినెస్‌లు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కనుక ఈ రంగంలో రాను రాను అంత పోటీ ఉండదని అంటున్నారు.