YS Sharmila : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని ప్రస్తుతం తెలంగాణలో పలు ప్రాంతాలు పర్యటిస్తున్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గా ల ప్రజలకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదన్నారు.
‘2009లో ప్రజా యుద్ధనౌక, నా అన్న గద్దర్ గారితో మాట్లాడినప్పుడు మేం కోరుకున్నది ఒక్కటే.. సామాజిక తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ. బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఆ రోజు ఎదురుచూశాం. కానీ, అది సాధ్యం కాలేదు. దేశంలో ఈ రోజు 31 మంది బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.‘తెలంగాణ నాకు ఎంతో బాలాన్ని ఇచ్చింది. అదే స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నా. నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోంది. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతాను. ఏ మార్పు కోసమైతే, తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తా. మీకు ఏ సమస్యలున్నా నేనొస్తాను. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ పర్యటిస్తా’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇక షర్మిల గురించి పరోక్షంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. బర్రెలక్కకి ఉన్న ధైర్యం కూడా షర్మిలక్కకి లేదని , అందుకే ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసింది అన్నట్టుగా పవన్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఉమ్మడి ఖమ్మంతోపాటు హైదరాబాద్, ఇతర జిల్లాల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ భాగం కాబట్టే తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు.