Purandeshwari : ఏపీ రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కిపోతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటోన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో గతాన్ని తవ్వి పోసుకుంటోన్నారు. విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌పై కొనసాగుతున్నారని, అందులో పొందుపరిచిన షరతులను ఉల్లంఘిస్తోన్నారంటూ పురందేశ్వరి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాయడంతో వార్ మొదలైంది.
పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరారంటూ ధ్వజమెత్తారు. టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీపై ఆమెకు ప్రేమాభిమానం లేదంటూ ఆరోపించారు. మొదట టీడీపీ..ఆ తరువాత ఎన్టీఆర్ టీడీపీ, అనంతరం బీజేపీ, మళ్లీ కాంగ్రెస్, ఇప్పుడు మళ్లీ బీజేపీ.. ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరికి ఉందని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి.. పురంధేశ్వరి అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకో వైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికమని సాయిరెడ్డి అన్నారు. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అంటకాగిందని ఆరోపించారు.
అయితే చంద్రబాబుని అరెస్ట్ చేయడంపై పురంధేశ్వరి స్పందిస్తూ.. మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేం ప్రశ్నలని లేవనెత్తాం కాబట్టి, ఇంకొకళ్ల మీద నెపం పెట్టాలని చూస్తున్నారు. ఇది నిరంకుశంగా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్, బీజేపీ పొత్తు ఉంటుంది, సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు చెబుతాను అని పురంధేశ్వరి అన్నారు. ప్రస్తుతం పురంధేశ్వరి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.