Sajjala Ramakrishna Reddy : గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును.. పవన్ కల్యాణ్ కలవడమే కాకుండా ఆయన జైలు నుండి బయటకు వచ్చాక తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయాలలో సంచలనంగా మారాయి. పవన్ ప్రకటన తర్వాత వైసీపీ నాయకులు ఆయనపై దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… చంద్రబాబును పవన్ కలవడం ఒక డ్రామా అంటూ విమర్శించారు రాజకీయ ఎత్తుగడలో భాగంగానే సింపతీ డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు వేశారు సజ్జల. స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టై జైల్‌లో ఉండడమే తప్పన్నట్లు తెలుగు దేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారని.. వాళ్ల దబాయింపులకు తాము సమాధానం ఇవ్వాల్సి వస్తోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
2014 ఎన్నికల్లో చంద్రబాబు కోసం పనిచేశారని, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి విడిగా పోటీ చేశారని విమర్శించారు. ఇప్పుడు కలిశామంటున్నారు గానీ అసలు విడిపోయిందెప్పుడని సజ్జల ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ ఈ స్థాయిలో మద్దతు లేదు. మొదటిసారి 70 శాతానికిపైగా మద్దతు మాకు ఉంది.. వచ్చే ఎన్నికల్లో ఎవరు కలిసినా మాకు డోకా లేదు.. ఈసారి 60 శాతం ఓట్లు వస్తాయి.. ప్రజల నుంచి వస్తున్న స్పందన, మద్దుతుతో ఈ మాట చెప్తున్నాం… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్దంగానే ఉన్నాం.. పవన్ చేసే మేకపోతు గాంభీర్యం లాంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ విడివిడిగా ఉన్నట్టుగా నటించారని విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ డూప్ అని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం పనిచేశారని.. 2019లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా చూశారని విమర్శించారు. బీజేపీని తీసుకొచ్చే బాధ్యతను పవన్‌కు చంద్రబాబు అప్పగించారేమోనని అన్నారు. పవన్ ఎప్పుడూ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేదని.. ఆయన అభిమానులే తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైసీపీ సిద్దంగా ఉందని వెల్లడించారు.