Chandrababu : స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబుని శనివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తాను చేసిన నేరం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు లాయర్లు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారు. “45 ఏళ్ళ నా రాజకీయ జీవితం మీద మచ్చ వేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఎవరివల్ల కాలేదు. ఎందుకంటే నిప్పులా బతికా. తెలుగు ప్రజల బాగు గురించి ఆలోచించడం తప్ప, నాకు మరొక ధ్యాస ఉండదు. ప్రజల గురించి పోరాడుతున్నా కాబట్టే ఈ రోజు ఈ బెదిరింపులు…అక్రమ అరెస్టులు. ఇవి ఏవీ నన్ను, నా ప్రజల నుండి వేరుచేయలేవు. ప్రభుత్వ అక్రమాలపై నా పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమే….అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే. భయపడే..రాజీ పడే ప్రసక్తే లేదు” అని చంద్రబాబు అన్నారు.
అరెస్ట్ చేశాక చంద్రబాబు ప్రజలనుద్దేశించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. తను ఏనాడు తప్పు చేయలేదని, ప్రజల కోసం ఎప్పుడు తాను పోరాడుతూనే ఉంటానని అన్నాడు. అలానే తనని నమ్మిన వారికి ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపుల కోసమే అరెస్ట్ చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పోలీసులు ప్రొసీజర్ పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అర్ద్రరాత్రి రాజమండ్రి జైలుకు చేరుకున్నారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు.
ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. హైకోర్టులో చంద్రబాబు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు కు ఆయన తరపు న్యాయవాదులు నిర్ణయించారు.చంద్రబాబుకు న్యాయస్థానం 14 రోజులపాటు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అక్కడ న్యాయస్థానంలో అధికారిక లాంఛనాలు పూర్తి చేశాక సిట్ అధికారులు జైళ్ల ఎస్కార్ట్‌తో ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ నుంచి తరలించారు. చంద్రబాబుకు ఇంటి భోజనంతోపాటు మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది.