Roja : టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం తెల్లవారుజామున నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ అట్టుడికిపోయింది. చంద్రబాబుకు మద్దతుగా భారీ సంఖ్యలో రోడ్లపైకి టీడీపీ అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన నేతకు సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నించారు.ఇక చంద్రబాబుని అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
రిమాండ్ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు. జ్యుడిషియల్ రిమాండ్‌కు సంబంధించిన అధికారిక లాంచనాలు పూర్తి చేసి, ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించనున్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. ముఖ్యంగా ఏపీ మంత్రి ఆర్కే రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వరుసగా విమర్శలు గుప్పించిన మంత్రి ఆర్కే రోజా.. ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పు కోసం ముందు నుంచే ఎదురుచూశారు.
తీర్పు కచ్చితంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తుందని, రిమాండ్ విధిస్తారని ఊహించిన ఆమె స్వీట్లు, బాణాసంచా రెడీ చేశారు. ఇలా తీర్పు ప్రకటించగానే వెంటనే తన ఇంటికి వచ్చిన కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచుతూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. చంద్రబాబు అంటేనే మండిపడే వైసీపీ రాజకీయ నేతల్లో ఒకరైన రోజా.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయనపై పలు సెటైర్లు వేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వానికీ, వైసీపీ ప్రభుత్వానికీ తేడా గుర్తుచేస్తూ ఆమె వేసే సెటైర్లు సీఎం జగన్ ను కూడా పలుమార్లు ఆకట్టుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబుపై రోజా చేస్తున్న మాటల దాడి మరింత ఎక్కువైంది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుపై విమర్శలతోనే ఆమె మంత్రి కూడా అయ్యారనే ప్రచారం కూడా ఉంది.