KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ విమర్శలు కూడా గుప్పిస్తుంటారు. తాజాగా ఆయన తనదైన శైలిలో ఏపీ రాజకీయాలపై స్పందించారు. ప్రజాశాంతి పార్టీతో చేయి కలపాలని నాలుగేళ్ల నుంచి పవన్ కల్యాణ్ ను కోరుతున్నామని, కానీ పవన్ కల్యాణ్ రావడంలేదని విమర్శించారు. తనకు మోదీయే ముద్దు అంటున్నారని ఆయన అన్నారు. పవన్ ఢిల్లీ వెళితే మోదీ, అమిత్ షా అపాయింట్ మెంటే ఇవ్వరని… తాను ఇప్పుడు ఢిల్లీ వెళ్లినా మోదీ, అమిత్ షా తనను వెంటనే కలుస్తారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. కానీ వాళ్లు తనకు అవసరం లేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయ్యేలా మోదీ చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ వైపల్యాలపై తాను ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీ వరదలు వచ్చాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తుచేశారు. 2019లో నాదే తప్పు. ఒకరితో పొత్తులు పెట్టుకుందామని చివరి వరకు ఆగాం. వారు మోసం చేశారు… అమ్ముడుపోయారు. పవన్ కల్యాణ్ కు నిలకడలేదు. పవన్ నిలకడగా ఉంటూ, ప్రజాశాంతి పార్టీతో కలిస్తే జనసేనకు ఓటు బ్యాంకు పెరుగుతుంది. నిలకడ లేకనే, కాపులందరూ ఆయనకు దూరమయ్యారు అని పాల్ అన్నారు.
ఏడాదికి పవన్ ఒక 10 కోట్లు సంపాదిస్తాడేమో కాని వంద కోట్ల అప్పు ఎలా తీరుస్తాడు. బీజేపీతో రాసుకొని పూసుకొని తిరుగుతున్న పవన్ రాష్ట్రానికి ఏం చేశాడు. స్పెషల్ స్టేటస్ తెచ్చాడా, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చాడా లేదంటే రోడ్లు వేయించాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పాల్. తోట చంద్రశేఖర్ వంటి రిటైర్డ్ ఐఏఎస్, ‘జేడీ’ లక్ష్మీనారాయణ వంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, రావెళ్ల కిశోర్ వంటి నేతలు కూడా జనసేనలో చేరి వెంటనే వదిలేశారు. కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పవన్ ను వదిలేశారు. వీళ్లందరూ ఎందుకు వదిలేశారంటే కారణం ఒక్కటే. మోదీకి పవన్ మద్దతు ఇవ్వడమే. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే మోదీ అని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.