Chandra Babu : ఏపీ రాజకీయాల్లో ట్రెండ్ మారినట్టు కనిపిస్తుంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఏపీ అసెంబ్లీ వేదికగా ప్రజంటేషన్లతో అటు ఎమ్మెల్యేలను, ప్రజలను ఆకట్టుకున్న జగన్ స్ట్రాటజీని ఇప్పుడు చంద్రబాబుకూడా మొదలుపెట్టారు. ఆయన తాజాగా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ.. అధికార పార్టీపై విమర్శులు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్, విజయ్ సాయి రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు వంటి వారు 2021లో నే పోలవరం పూర్తి చేస్తామని గతంలో చెప్పుకొచ్చారు.
వారి వీడియోలని చూపిస్తూ చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. వీళ్లకి నవ్వులాట అయిపోయింది. మాట మీద ఉండరు. వీరు నాయకులు. వీరితో మనం తిట్టించుకోవాలి అంటూ మండిపడ్డారు. జగన్ తన అసమర్థతతో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పడుకోబెట్టారు. ఈ అసమర్థుడి పాలనను ఇంకా ఈ రాష్ట్రం భరించాలా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో కేవలం రూ.4,300 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ‘మేం 96 శాతం పనులు పూర్తి చేసిన చోట మిగిలిన 4 శాతం పనులను కూడా ఈ నాలుగేళ్లలో చేయలేదు.
పోలవరం పూర్తి చేసి గోదావరి జలాలను పెన్నా వరకూ తీసుకెళ్తే సాగర్ కుడి కాలువ, ఎడమ కాలువల కింద మొత్తం ఆయకట్టుకు నీరు ఇవ్వడంతోపాటు రాయలసీమకు కూడా చాలినంత నీరు ఇవ్వగలిగేవాళ్లం. కృష్ణా డెల్టా, సాగర్ కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు పట్టి సీమ, చింతలపూడి, వైకుంఠపురం ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలు ఇస్తే కృష్ణాలో 300 టీఎంసీల నీరు ఆదా అవుతుంది. ఆ నీటిని రాయలసీమకు మళ్లిస్తే ఆ ప్రాంతం కరువు తీరుతుంది. ఇంత పెద్ద ప్రణాళికతో మేం పనిచేస్తే జగన్ ఒక్క పనీ కూడా పూర్తి చేయకుండా సర్వనాశనం చేశాడు’ అని విరుచుకుపడ్డారు. మేం 64 ప్రాజెక్టులు చేపట్టి అందులో 23 పూర్తి చేశాం. వైసీపీ ఒక్కటి కూడా కొత్తగా చేపట్టింది లేదు. నడుస్తున్న వాటిలో ఒక్కటీ పూర్తి చేసింది లేదు అని చంద్రబాబు అన్నారు.