Pawan Kalyan Arrest : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. గత నెలలో వారాహి యాత్ర మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.ఇక అదే క్రమంలో ఏలూరులో జరిగిన వారాహి విజయయాత్ర సభలో పవన్ వాలంటీర్లపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీర్లు సంక్షేమ పథకాల లబ్దిదారుల నుంచి సేకరించి ప్రభుత్వానికి ఇస్తున్న డేటా దుర్వినియోగం అవుతోందని, దీని వల్లే రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారని ఆరోపించడంతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు వాలంటీర్లు కూడా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.
కొందరు వాలంటీర్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఓ వాలంటీర్ ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణలంక పీఎస్ లో కేసు నమోదైంది. సురేష్ అనే వాలంటీర్ పవన్ కళ్యాణ్ ఏలూరులో చేసిన వ్యాఖ్యలపై కృష్ణలంక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో పవన్ వ్యాఖ్యలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ దర్యాప్తులో పవన్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది కీలకంగా మారింది. పోలీసులు సెక్షన్ 153, సెక్షన్ 153ఏ, సెక్షన్ 505(2) కింద అభియోగాలు నమోదు చేయగా, అవి సరైనవో కావో నిర్దారించుకోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని కృష్ణలంక పోలీసులు దృష్టిసారిస్తున్నారు.
వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకూ వైసీపీ నేతలు, వాలంటీర్లు నిరసనలు చేపట్టడంతో పాటు ఫిర్యాదులు చేస్తున్నా తొలిసారి విజయవాడలో కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ అరెస్ట్ తప్పదంటూ కూడా ప్రచారం జరుగుతుంది. పవన్ అరెస్ట్ జరిగితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయానే టెన్షన్ కూడా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ పై రీసెంట్‌గా బొత్స సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారని.. పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.