ముఖ్యమంత్రి పదవి తీసుకొమ్మని ఏ పార్టీ అడగదని జనసేన (Jensena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తానైతే చంద్రబాబును (Chandrababu Naidu) కానీ బీజేపీ అధ్యక్షుడిని కానీ సీఎం (CM) పదవి తీసుకోవాలని అడగనని చెప్పారు. భాగస్వామ్య పక్షాలను ముఖ్యమంత్రి పదవికోసం డిమాండ్ చేయాలంటే కనీసం 30, 40 స్థానాలు రావాలని తెలిపారు. సీఎం పదవికోసమే తాము పనిచేస్తున్నామని వెల్లడించారు. చాలామంది తమను పెద్దన్నపాత్రవహించాలని అంటున్నారని, అలా చేయాలంటే బాధ్యతవహించడమని.. దానిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. తాము రాష్ట్ర ప్రయోజనాలకోసమే పనిచేస్తామని చెప్పారు. అమరావతిలో పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి ఇక్కడే ఉండి పూర్తిస్థాయిలో పనిచేస్తానని తెలిపారు.
తమకు గౌరవప్రదంగా ఉంటే భాగస్వామ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దాష్టీకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. జనసేనకు గతంలోకంటే బలం పెరిగిందన్నారు. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పటిష్ఠంగా లేకపోయినా తమకు పట్టున్న ప్రాంతాల్లో 30 శాతం బలం పెంచుకున్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్తును రక్షించడానికి, వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కల్పించడానికే పార్టీని స్థాపించాను తప్ప తానొక్కడి కోసం కాదన్నారు.
ముఖ్యమంత్రి పదవి తానై వరించాలికానీ.. దాని కోసం వెంపర్లాడనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నిస్వార్థంగా ఉండాలన్నారు. తాను పదవులకోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. సినిమాల్లో కూడా తనను ఎవరూ సూపర్ స్టార్‌ను చేయలేదని, ఆ హోదాను తానే సాధించుకున్నానని చెప్పారు. రాజకీయాల్లో కూడా ఒక పార్టీ తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎందుకు అనుకుంటుందని జనసేనాని అన్నారు. సీఎం పదవి తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడిని, బీజేపీ అధ్యక్షుడిని తానైతే అడగనని స్పష్టం చేశారు. మన సత్తా చూపి ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలనేదే తన కండిషన్ అన్నారు. పొత్తుల ద్వారా వైసీపీ నుంచి అధికారాన్ని తీసుకుని ప్రజలకు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు.
రోడ్లు సరిగా లేకపోవడంతో వైసీపీ సర్పంచ్ ప్రమాదానికి గురై చనిపోయారని, గ్రామీణ వ్యవస్థను చంపేశారని విమర్శించారు. నిధులు ఇవ్వనప్పడు ఎంతమంది సర్పంచులు గెలిస్తే ఏముందని విమర్శించారు. కేరళ తరహాలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. గ్రామీణ స్వరాజ్యం రావాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠ చేయాలన్నారు. ఈ దిశగా ఇప్పటికే పలువురు సర్పంచులకు లేఖలు రాస్తున్నామని, వారితో సమావేశమవుతామని చెప్పారు.
విమర్శలు లేకుండా రాజకీయాలు ఉండవని పవన్ అన్నారు. ప్రజల కోసం తాను ఎవరితోనైనా తిట్టించుకోవాడానికి సిద్ధంగా ఉన్నని చెప్పారు. కువిమర్శను బలంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తనతో నడిచేవారే తనవారని, తమ పార్టీ ద్వారా రాష్ట్రం కోసమే పనిచేస్తున్నానని వెల్లడించారు. ఉన్నతమైన దృష్టితో చూస్తే తాను అందరికీ అర్ధమవుతానని, ఒక పార్శ్వంలోనే చూస్తే ఇంకోలా కనిపిస్తానని.. దానికి తానేమీ చేయలేనని తెలిపారు. అన్నింటికీ సంసిద్ధంగా ఉండి.. తమవంతు ప్రయత్నం చేస్తే పదవనేది తనంతట తానే వస్తుందని చెప్పారు. పల్లంలోకే నీళ్లొస్తాయని, కష్టపడి పనిచేస్తే ముఖ్యమంత్రి పదవి వరించి తీరాలన్నారు. తాము దానికోసమే పనిచేస్తున్నామని చెప్పారు.