నందమూరి హీరో తారకరత్న లోకేష్ పాదయాత్ర ప్రారంభం వేళ కుప్పం పట్టణం లక్ష్మీపురంలోని మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేశ్, నందమూరి బాలకృష్ణ తో పాటుగా తారక రత్న పాల్గొన్నారు. అదే సమయంలో ఒక్క సారిగా తారకరత్న కుప్పకూలారు. వెంటనే పార్టీ వలంటీర్లు ఆయన్ను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్ర గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. అర్ద్రరాత్రి రెండు ప్రత్యేక అంబులెన్సులలో తారక రత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యబృందం పర్యవేక్షణలో తీసుకెళ్లారు.
నందమూరి తారకరత్న హెల్త్ బులిటెన్‌ను తాజాగా విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ- డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్న ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జనవరి 28న అర్ధరాత్రి 1 గంటలకు రోడ్డు మార్గంలో తారకరత్నను అంబులెన్స్‌లో నారాయణ హృదయాలయకు తరలించారు. ఎక్మో వైద్య విధానం ద్వారా తారకరత్నకు కృతిమంగా శ్వాసనందిస్తున్నట్లు తెలిసింది. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హాస్పిటల్‌లో ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సాయంత్రానికి హాస్పిటల్‌కు వెళతారని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తారకరత్న గుండెలో బ్లాక్స్ అధికంగా ఉన్నాయి. స్టంట్ వేయాలంటే షుగర్ సాధారణ స్థితిలో ఉండాలి. కొన్నాళ్లుగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ షుగర్ టాబ్లెట్స్ వేసుకోకపోవడంతో షుగర్ లెవల్ 400కు చేరింది. ఈ కారణంగా వైద్యులు స్టంట్స్ వేయలేకపోయారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు.