Hitler Movie : సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులు, వింతలూ చోటుచేసుకుంటాయి. కొందరిని అదృష్టం వరిస్తే, మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. దురదృష్టం వెంటాడినవాళ్లు కొన్నాళ్ళు బాధపడి వదిలేసినవాళ్లు ఉంటారు. మరికొందరు కుంగిపోతారు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన హిట్లర్ మూవీ విషయంలో జరిగిన విచిత్ర ఘటనల్లో దెబ్బతిన్న ప్రముఖ రచయిత మరుధూరి రాజా మాత్రం వీటిని పట్టించుకోకుండా ఉన్నారు.
పట్టించుకుంటే బాధే మిగులుతుందని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో మరుధూరి రాజా చెప్పారు. అందుకే వదిలేశానని చెప్పారు. మలయాళంలో ముమ్ముట్టి హీరోగా వచ్చిన మూవీని హిట్లర్ పేరిట రీమేక్ చేయాలని భావించడం, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా, ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో తీయాలని అనుకోవడం జరిగాయట.
అయితే అప్పటికే మోహన్ బాబుతో ఈవీవీ రెండు సినిమాలు కమిట్ కావడంతో ఈ సినిమా కష్టమని చెప్పారట. అదే సమయంలో ఎడిటర్ మోహన్ ఫోన్ చేసి, మన సినిమాకు మెగాస్టార్ చిరంజీవి హీరో అని చెప్పారట. స్క్రిప్ట్ విషయంలో కొన్నాళ్ళు పనిచేసిన మరుధూరి రాజా పేరు కాకుండా సినిమాలో వేరే వారి పేరు వేశారట. అయినా పెద్దగా పట్టించుకోలేదని అందుకే హాయిగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.