ప్రతినిధి చిత్రంగా రైటర్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన ఆనంద్ రవి తర్వాత హీరోగా మారిన విషయం తెలిసిందే.. తన సినిమాలకు కథ, కథనం, మాటలను అందిస్తూ లీడ్ రోల్‌లో సినిమాలు చేస్తూ వచ్చారు. ఆనంద్ రవి అలా లీడ్‌గా నటించిన చిత్రం నెపోలియన్. ఆ తర్వాత ఐదేళ్లకు ఆయన కొరమీను చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. గతేడాది డిసెంబరు 31న థియేటర్లలో రిలీజైనప్పటికీ.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రత్యక్షమైపోయింది. ఆనంద్ రవి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శత్రు, హరీష్ ఉత్తమన్ తదితరులు నటించిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.
విజయవాడలో డీజీపీ మీసాల రాజు (శత్రు) అంటే రౌడీలకు భయం. అలాంటి వ్యక్తి వైజాగ్ సిటీకి రాగానే అతనిపై కొందరు దాడి చేసి మీసాలను తీసేస్తారు. దాంతో అతనిలో అవమాన జ్వాలలు కట్టుల తెంచుకుంటాయి.. డ్యూటీలోకి ఎంట్రీ ఇవ్వగానే జాలరి పేట గురించి సీఐ రమేష్ (గిరి) దగ్గర ఆరా తీస్తాడు.. కోటీ, మీనాక్షి (కిశోరి ధాత్రిక్) మధ్య ప్రేమ.. కరుణ, కోటి మధ్య గొడవ.. జాలరి పేటలో జరిగే డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన గొడవలు ఇలా అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. అదే సమయంలో మీసాల రాజు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు ఏంటి? అనేది సినిమా చూడాల్సిందే.
ఆనంద్ రవి కోటి అనే జాలరి పేట యువకుడిగా, విలన్ అనుచరుడిగా.. చివరకు అతనికి ఎదురు తిరిగే వ్యక్తిగా అద్భుతంగా నటించారు.. హీరోయిన్ కిశోరి ధాత్రిక్ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించింది.. రాజా రవీంద్ర పాత్ర చిన్నదే అయినా చాలా రోజుల తర్వాత చాలా మంచి రోల్ పోషించారు. జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్ కూడా మంచి పాత్రలో కనిపించి అలరించాడు. శత్రు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా.. డాన్ పాత్రలో హరీష్ ఉత్తమన్ వారి వారి పాత్రలకు న్యాయం చేయగా, సినిమా ఎక్కడా బోరింగ్‌గా అనిపించదు. డైరెక్టర్ శ్రీపతి కర్రి సినిమాను స్క్రీన్‌పై ఆవిష్కరించిన తీరు బావుంది. అనంత్ నారాయణ్ ఏజీ సంగీతం బావుంది. యుద్ధమే అనే పాటను మంచి డెప్త్‌తో రాశారు. పక్కా కమర్షియల్ చిత్రాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు సినిమా కాస్త స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది.