Allu Arjun : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సంచలనాలు సృష్టించింది. సెలబ్రిటీల నుండి ప్రేక్షకుల వరకు అందరూ దేశవ్యాప్తంగా పుష్ప రాజ్ సిగ్నేచర్ స్టైల్ ని అనుకరించడం ప్రారంభించారు. పుష్ప అన్ని భాషాల్లో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పిలిపించుకుంటూ క్రమంగా ఐకాన్ స్టార్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించారన్న విషయం మీకు తెలుసా..?
అల్లు అర్జున్ బాలనటుడిగా నటించడమే విశేషమైతే.. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడం మరో విశేషం. ఇప్పటివరకు మనకు జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, మహేష్ బాబు బాలనటులుగా కనిపించారనే తెలుసు. మహేష్ బాబు కృష్ణ నటించిన చాలా సినిమాల్లో బాలనటుడిగా నటించి మెప్పించారు. హీరో తరుణ్ దాదాపు 20 సినిమాల్లో బాలనటుడిగా నటించి ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాల్లో బాల నటుడిగా కనిపించారు.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే 2 సినిమాల్లో బాల నటుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. బన్నీ బాల నటుడిగా నటించిన సినిమాల్లో ఒకటి చిరంజీవి విజేత కాగా, మరొకటి కమల్ హాసన్ స్వాతిముత్యం. ఈ సినిమాలో అల్లు అర్జున్ కమల్ హాసన్ మనవడిగా నటించారు. అల్లు అర్జున్ సినిమాల్లోకి రాకముందు మెగాస్టార్ హీరోగా నటించిన డాడీ సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప 2 కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.