Lemon Water : ఏడాది పొడవునా మనకు లభించే నిమ్మకాయల శక్తి తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. సంప్రదాయ ఆహారంలో, మోడ్రన్ ఫుడ్ వెరైటీల్లోనూ కూడా నిమ్మకాయకు తిరుగులేదు. నిద్ర లేవగానే మీ రొటీన్ ను నిమ్మ రసం వేసిన నీళ్లు తాగి ప్రారంభిస్తే ఇక ఆరోజంతా మీరు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి వికారాలున్నా, నిద్ర సరిగ్గా రాకపోయినా, అలసటగా ఉన్నా, కడుపులో జీర్ణం కాకపోయినా మీలో హుషారు నింపే శక్తి నిమ్మకాయలకు ఉంది. కేవలం వేసవిలోనే కాదు ప్రతిరోజూ తగినంత నిమ్మరసం తీసుకుంటే బోలెడు ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.. మరి అవేంటో తెలుసుకుందాం రండి. బరువు తగ్గొచ్చు: ప్రతిరోజూ కాస్త నిమ్మరసం తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.
కాబట్టి వేగంగా బరువు తగ్గచ్చు. ఇందులో పెక్టిన్ అనే పీచు పదార్థం ఉంటుంది. ఇది మీకు తక్కువ ఆకలిని కలిగిస్తుంది. దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గి స్లిమ్ అవ్వాలనుకునేవారికి లెమన్ వాటర్ మంచి ప్రత్యామ్నాయం. డీహైడ్రేషన్ దూరం: వేసవిలో మనం ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో లెమన్ వాటర్ మనల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు శరీరానికి హాని కలిగించే వ్యర్థపదార్థాలను, ట్యాక్సిన్లను బయటకు పంపించడంలో బాగా తోడ్పడుతుంది. కిడ్నీ స్టోన్స్: నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లోని రాళ్లను సైతం కరిగించగలదు. కిడ్నీలో ఏర్పడ్డ చిన్న రాళ్ల వంటి వాటిని ముక్కలుగా చేసి మన శరీరం నుంచి ఈ చిన్న రాళ్లను బయటికి పంపేలా నిమ్మరసం అద్భుతాలను చేస్తుంది.
జీర్ణక్రియ రేటు: ఉదయాన్నే కాస్త నిమ్మరసం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. మలబద్దకం, అజీర్తి సమస్యలు కూడా తొలగిపోతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. చర్మ నిగారింపు: నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. అంతేకాదు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది: నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే నిమ్మరసం తీసుకుంటే చాలాసేపటి వరకు ఎనర్జిటిక్‌గా ఉంటారు.