Pokiri : పోకిరి అనగానే అందరికి గుర్తొచ్చే డైలాగ్.. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. ఈ డైలాగ్ అప్పుడే కాదు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఇందులోని డైలాగ్స్ తూటాల్లా పేలాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ చిత్రం టాలీవుడ్‌కి కలెక్షన్ల టేస్ట్ చూపించింది. 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. తొలుత ఈ సినిమాకు మహేశ్‌ని అనుకోలేదట పూరి. మాస్ మహారాజ రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్దం చేసుకున్నాడు.
అయితే కొన్ని కారణాల వల్ల రవితేజతో ఈ సినిమాను చేయలేకపోయాడట. అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ కథ మహేష్ దగ్గరకు చేరింది. ఆయన ఈ స్క్రిప్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. పూరి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని ‘పోకిరి’గా మార్చారు. ఇక సోనూసూద్‌ని కూడా ఇందులో హీరోగా అనుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నా, ఇందులో నిజమెంత ఉందనే దానిపై క్లారిటీ లేదు. మొదట్లో ఈ కథకి ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య’అని టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడట పూరి. కానీ కథ మహేష్ దగ్గరకు రావడంతో టైటిల్‌తో పాటు కథలో మార్పులు కూడా చేశారట.
ఇక ఈ చిత్రానికి హీరోయిన్‌గా అయేషా టాకియాను సంప్రదించారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పులేదు. ఆ తర్వాత కంగనా రనౌత్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. షూటింగ్‌కి రెడీ అవుతున్న సమయంలో కంగనా హ్యాండ్ ఇవ్వడంతో చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదించి ఒప్పించారు. ఈ సినిమాతో ఇలియానా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది.