Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున సరైన విజయం చూసి చాలా కాలం అయిపోయింది. కానీ ఆయన వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటున్నారు. నేటి తరం యంగ్ హీరోలకు గానీ తన ఇద్దరు కొడుకులకి కానీ ఆయన స్టైల్ లో నటనలో గట్టి పోటీ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఘోస్ట్ సినిమా ద్వారా చాలా రోజుల తరువాత నాగార్జున ఒక స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఇండియన్ ఎంబసీలో పనిచేసే ఒక రిటైర్డ్ రా ఏజెంట్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ ఘోస్ట్ చిత్రం టీజర్ ఇంకా ట్రైలర్లతోనే ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించిందని అలాగే అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. నాగార్జున కూడా ఈ సినిమా విజయంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నట్టుగా సమాచారం. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జునతోపాటు సోనాల్ చౌహాన్, బాలీవుడ్ నటి గుల్ పనాగ్, అనిక సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్, రవి వర్మ, మనీష్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు. గుంటూర్ టాకీస్, పీఎస్వీ గరుడ వేగ చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రవీన్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఇక ఈ సినిమా చేయడం కోసం నాగార్జున తీసుకున్న రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఇందుకు గాను ఆయన రూ.6 కోట్ల పారితోషికం అందుకున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. అంతే కాకుండా ఆంధ్రలోని కొన్ని ఏరియాల్లో సినిమా పంపిణీ హక్కుల ద్వారా కూడా ఆయనకు ఆదాయం రానుంది. సినిమాపై వచ్చే లాభాల్లో కూడా ఆయనకు షేర్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
రూ.20 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకు నాగార్జున చేసిన భారీ యాక్షన్ సీన్లు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. అద్భుతమైన విజువల్స్ ఇంకా అబ్బుర పరిచే స్టంట్లు ప్రేక్షకులను మైమరిపిస్తాయని అంటున్నారు. ఇంత వరకు ఇలాంటి పాత్ర చేయని నాగార్జున కెరీర్ లో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.