CM YS Jagan : ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నారు. అనేక ప్రాంతాలు చుట్టేస్తూ పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంటున్నారు. మరోసారి తానే సీఎం అంటూ బల్లగుద్ధి చెబుతున్నారు. గెలుపుపై ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగన్ ఓ టీవీ ఛానెల్‌కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో నాకు ఫోన్ లేదు…నంబరే లేదన్నారు. ఏదైనా అవసరం వస్తే..పక్కనే పీఏలు ఉంటారు.. అన్ని వాళ్లే చూసుకుంటారని చెప్పుకొచ్చారు. నాకు ఫోన్ వాడే అవసరం రాలేదని వివరించారు జగన్.
నాకంటూ ప్రత్యేకంగా ప్రైవేట్ లైఫ్ ఉండదు. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే. అందరితో సత్సంబంధాలు కొనసాగించాలని చూస్తాను.. షర్మిల ద్వారా లబ్దిపొందాలని చూస్తున్నారు కాని ఎన్నికలయ్యాక షర్మిల స్టాండ్ ఏంటో తెలుస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. నా పిల్లలు విదేశాలలో చదువుకుంటుండడంతో వారితో తక్కువ సమయం గడుపుతున్నా.రిఫ్రెష్ మెంట్ కోసం అప్పుడప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూస్తానని అన్నారు. ఇక ఒత్తిడి నుండి బయటపడేందుకు ప్రార్ధనలు ఎక్కువగా చేస్తానని జగన్ చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులకి అవకాశం ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు వస్తాయని అన్నారు. ఓటు బ్యాంక్ చీల్చేందుకు చాలా కుట్రలు చేస్తున్నారంటూ జగన్ పేర్కొన్నారు.
టీవీ-9లో జగన్ ఇంటర్వ్యూను లైవ్‌లో అత్యధికంగా 72 వేల మంది చూశారు. సోషల్ మీడియాలోనూ జగన్ ఇంటర్య్వూకు సంబంధించిన అనేక వీడియో క్లిప్స్ వైరల్‌గా మారాయి. జగన్ తన ప్రసంగాల్లో గత ఐదేళ్లలో ఏం చేశానో, మళ్లీ అధికారం ఇస్తే ఏం చేయబోతున్నానో ఒక్కో అంశాన్ని చాలా చక్కగా వివరించారు. ఒక్కో అంశంపై ఓపికగా క్లారిటీ ఇచ్చారు. దీంతో జగన్ ఏం చెప్తాడో వినాలని ప్రజలు ఆసక్తి చూపారు. జగన్ తను ఏం చెప్పదలుచుకున్నారో అది ముక్కుసూటిగా చెప్పేశారు.