Vidadala Rajini : గుంటూరులో అతిసారం బారిన పడిన చాలామంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నగరంలో అనేక మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు. వివిధ ఆస్పత్రులలో చేరి డయేరియా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యంతో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది బాధితులు జీజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్లో నగరపాలక, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి విడదల రజిని ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి విషయంలో ఎంక్వయిరీ జరుగుతోందని, అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తే చర్య తీసుకుంటామని విడదల రజిని పేర్కొన్నారు. మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. మహిళా మంత్రిగా డయేరియా బాధితులను పరామర్శించేందుకు వస్తే రౌడీయిజం చేస్తున్నారని ఆమె విమర్శించారు. దాదాపు 20 మంది డయేరియా బాధితులు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రికి వచ్చారని అందరికి మెరుగైన వైద్యం అందించినట్టు తెలిపారు.
ఎవరూ వచ్చిన చికిత్స చేసేందుకు వైద్యులు సిద్దంగా ఉన్నారని అన్నారు. వాంతులు, విరోచనాలకు కారణాలను వెరిఫై చేస్తున్నారని, క్లోరినేషన్ సక్రమంగా చేస్తున్నారని చెప్పారు. బాధ్యత గలిగిన ప్రభుత్వంగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి రజిని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న లక్షణాలు మేరకు వైద్యం చికిత్స అందిస్తున్నారని అన్నారు. ఇటీవల చనిపోయిన పద్మ కుటుంబానికి పరిహారం చెల్లింపు రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు విపక్షాలు అనవసరంగా యాగి చేస్తున్నాయని, ఏ కారణాలతో చనిపోయినా డయేరియా మరణాలని చెబుతున్నాయని మండిపడ్డారు. నిందలు వేయాలనుకుంటే వేయండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. అలానే రిపోర్టర్ వేసే ప్రశ్నలకి అసహనం వ్యక్తం చేస్తూ కూడా ఆమె అక్కడి నుండి జారుకున్నారు.