Barrelakka : ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా బర్రెలక్క పేరు తెగ వినిపిస్తుంది. కావలసింది జరగడం లేదు కాబట్టి ప్రజాప్రతినిధిగా గెలిచి పనులు చేయాలని బర్రెలక్క అనుకుంటున్నది. ఆ అమ్మాయికి ఈ అధికార రాజకీయాలు తెలియవు. ఎన్నికల్లోకి దిగాలంటే ఎంత డబ్బు కావాలో, ఏమేమి హంగులుండాలో, అన్నిటికి మించి ఎంతటి నేపథ్యం ఉండాలో కూడా ఆమెకు పూర్తి అవగాహన లేదు. నాయకురాలి పాత్ర పోషిస్తున్నప్పుడు, తమ్ముడి మీద చిన్న చేయి పడిందని రాగాలు తీయగూడదని కూడా తనకు తెలియదు. తాను న్యాయపక్షం కాబట్టి, అన్నిటిని దాటుకుని వెళ్లగలననే అమాయకపు ధీమా ఆమెలో ఉంది.
కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తమ్ముడు భరత్ కుమార్ ని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో బర్రెలక్కకు ఎమి కాలేదు కానీ.. ఆమె తమ్ముడు గాయపడ్డాడు. దాడి తర్వాత బర్రెలక్క బోరున విలపించారు. తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. చిన్నవాడైన తన తమ్మున్ని తన కళ్ల ముందే కొట్టారని చెప్పుకొచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే బర్రెలక్కకి రోజురోజుకి మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు రూ. లక్ష విరాళం ప్రకటించారు. చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు ఆమె ప్రచారానికి సాయం చేస్తున్నారు. నిరుద్యోగులు ఆమె తరపున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా కోర్టుకు చెందిన ఓ న్యాయవాది మనవరాలు లండన్ నుంచి తన పాకెట్ మనీని బర్రెలక్క ఎన్నికల ఖర్చు కోసం పంపించింది. ఇలా అన్ని వర్గాల నుంచి బర్రెలక్కకు సపోర్టు పెరుగుతుండగా.. ఎన్నికల్లో ఆమె ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు శిరీష ఏ మాత్రం భయపడకుండా ముందుకు సాగుతుంది. తన మేనిఫెస్టో తెలియజేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రోజురోజుకి శిరీషకి మద్దతు పెరుగుతుండగా, ఆమె మాటలకి ఫిదా అవుతున్నారు.