Barrelakka : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష కోసం అన్ లైన్ లో స్వచ్చందంగా ప్రచారం చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని అందుకే బర్లు కాసుకుంటున్నానని తీసిన వీడియోతో నిరుద్యోగి శిరీషా తెలంగాణ వార్తల్లోకి ఎక్కింది. బర్లు కాసుకుంటున్న వీడియోతో బర్రెలక్కగా పేరొందిన శిరీషా అనూహ్యంగా నిరుద్యోగుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైంఇ. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీలోకి దిగారు.
శిరీషాకు కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించారు. తనను తాను బర్రెలక్క గానే ప్రమోట్ చేసుకుంటున్నారు శిరీష. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నిరుద్యోగి శిరీషా తనకు ఒక్కసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని, భవిష్యత్ ను మారుస్తానని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆన్ లైన్ లో ఆమెకు మద్దతుగా ప్రచారం పెరుగుతోంది. పోలింగ్ నాటికి సునామీ అయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు.
తన తమ్ముడిపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని బర్రెలక్క కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రజల మద్దతు పెరగడంతో ఓట్లు చీలిపోతాయని ప్రత్యర్థులు ఇలా దాడులు చేయించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తన తమ్ముడిపై దాడి చేసి గాయపపర్చడం దుర్మార్గమంటూ భోరున విలపించారు. యువత, నిరుద్యోగుల తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నానని ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బర్రెలక్క. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఆమె కోరారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన వెనక్కి తగ్గేది లేదని బర్రెలక్క చెబుతుంది.