PM Modi : తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. పార్టీలన్ని ప్రచారంపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించడం కోసం తెలంగాణలో పర్యటించారు. హైదాబాద్ ఎల్బీ నగర్‌లో కమలం పార్టీ నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దాంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వేదికపై కిషన్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
సభలో చివరగా ప్రధాని మోదీ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టం చేశారు. అత్యధిక బీసీ ఎంపీలు బీజేపీ నుండే ఉన్నారని తెలిపారు. కేంద్ర కేబినెట్లో ఓబీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువ మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించారు. ‘ఈ వేదికపై పవన్ కల్యాణ్ నాతో ఉన్నారు. మైదానంలో జన సునామీ ఉంది. ఈ మైదానంలో మార్పు తుపానును నేను చూస్తున్నాను. మీరు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణకు బీజేపీపై విశ్వాసం ఉందని స్పష్టమైన సందేశం తీసుకొచ్చారు అని పేర్కొన్నారు.
ఇక పవన్ ఎల్‌బీ స్టేడియంలో తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించాము అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నేడు రాజకీయాల కోసం, తెలంగాణలో జనసేన ఉనికిని చాటు కోవడం కోసం.. తెలంగాణ ఏర్పాటు గురించి ఇంతలా ప్రశంసిస్తున్న పవన్.. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమాన్నారో మర్చిపోయారా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ పరిస్థితి చూసి నాకు ఏడుపు వచ్చింది.. బాధతో 11 రోజులు అన్నం మానేశాను అన్నావు.. ఆ విషయం గుర్తు లేదా.. లేక ఎన్నికల కోసం మర్చిపోయావా అని పవన్‌ని కొందరు విమర్శిస్తున్నారు.