Suryakumar Yadav Sixes : ప్రస్తుతం ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డేలో శ్రేయాస్ అయ్యర్, గిల్ సెంచరీలతో మెరవగా సూర్యకుమార్ యాదవ్ సిక్సులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 6వ నంబర్‌తో మైదానంలోకి దిగిన సూర్య.. ఆరంభం నుంచే తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్లో నాలుగు బంతులకు నాలుగు సిక్సులు బాదాడు. అంతే కాకుండా కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.విశేషమేమిటంటే, ఈ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది.
2013లో ఆస్ట్రేలియాపై కింగ్ కోహ్లి కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించగా, ఇప్పుడు దానిని సూర్య బ్రేక్ చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్య అద్భుతమైన షాట్స్ ఆడుతూ కేవలం 37 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 6 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమ్ ఇండియా స్కోరు 399కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఏ బౌలర్ అనే తేడా లేకుండా బౌండరీలతో గిల్,శ్రేయాస్ విరుచుకుపడ్డారు. దాంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. అనంతరం ఇదే జోరును కొనసాగించిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ముందుగా శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అయ్యర్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇషాన్ కిషాన్(31) సైతం పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. ఇక ఆసీస్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగగా 215 పరుగులకే కుప్పకూలింది.
https://youtube.com/watch?v=XZHU0-Jinwg