Anil Kumar Yadav : చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కొందరు ఆయనకి మద్దతు ప్రకటిస్తుండగా,మరి కొందరు మాత్రం తగినశాస్తి జరిగిందనట్టు మాట్లాడుతున్నారు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించడంలో తప్పేమి లేదంటూ ఆయనపై సెటైర్స్ వేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా అనీల్ కుమార్ యాదవ్.. కక్షపూరితంగా కాదు… సాక్ష్యాధారాలు ఉన్నందుకే పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. మాజీ సీఎం, పీఎం ఐనా.. చట్టం ముందు అందరు సమానమని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. వాచ్ కూడా లేదని చెప్పుకునే చంద్రబాబుకు గంటకు కోటి రూపాయలు తీసుకునే లాయర్ ఎలా వచ్చాడంటూ ఆయన ప్రశ్నించారు.
అలానే మరిదిని కాపాడుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. బంధు ప్రీతి పక్కన పెట్టి.. ఆమె మాట్లాడాలని ఆయన హితవు పలికారు. పక్క సాక్ష్యాలు ఉన్నా కూడా అక్రమ కేసు అని ఎలా చెబుతారంటూ అనిల్ దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ పై కూడా తనదైన పంచ్‌లు వేశారు. తన పార్టీ నేతను అరెస్ట్ చేసినట్లు పవన్ కల్యాణ్ ఓవర్ యాక్షన్ చేశారని ఆయన మండిపడ్డారు. సుపుత్రుడే సైలెంట్ గా ఉంటే.. దత్తపుత్రుడు మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని అనిల్ దుయ్యబట్టారు.
చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ కూసాలు కదులుతున్నాయని, ఆయనకు మద్దతుగా జనాలు రోడ్ల మీదకు రావడం లేదని అచ్చెన్నాయుడు మాట్లాడిన ఆడియో లీకైందని అనిల్ తెలిపారు. అవినీతి అనకొండగా ఉన్న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ముద్దాయి అయ్యాడని అనిల్ పేర్కొన్నారు. ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ విషయంలో సీఎం జగన్ నిజాయితీగా వ్యవహరించారని, చట్టం ముందు అందరూ సమానమే అనే మెసేజ్ ను ప్రజలకు పంపామని అనిల్ చెప్పుకొచ్చారు. మరో ఆరు జన్మలు ఎత్తినా బాబు సీఎం అయ్యే అవకాశం లేదని, ఆయన అరెస్ట్ తో టీడీపీ మూతపడటం ఖాయమని అంటూ జోస్యం కూడా చెప్పారు అనీల్. ప్రస్తుతం అనీల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.