Vangalapudi Anitha : వైఎస్ జగన్‌తో పాటు ఆయన పార్టీ నాయకులపై టీడీపీ నాయకులు గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్ నియమించిన టీటీడీ సభ్యులు జాతి రత్నాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేసారు. ఇలాంటి బోర్డు వేస్తే పులులు తరమడానికి కర్రలు ఇవ్వాలనే నిర్ణయాలే వస్తాయని విమర్శించారు. నడక మార్గంలో పులులు వస్తున్నాయి కాబట్టి నడక మార్గం మూసేసినా ఆశ్చర్యం పోనక్కర్లేదన్నారు. డబ్బు కోసం ఎంత వరకైనా వెళ్లే వ్యక్తులు టీటీడీ బోర్డులో ఉన్నారని ధ్వజమెత్తారు.
చాగంటి కోటేశ్వరరావుకు బోర్డులో సభ్యత్వం ఇచ్చినా దాన్ని ఆయన తిరస్కరించారన్నారు. జగన్ పరిపాలనలో వేసిన టీటీడీ బోర్డులో చాగంటి కొనసాగలేకపోయారని తెలిపారు. రాజకీయ నిరుద్యోగులకు తిరుమల కొండ వేదికగా మారిందన్నారు. రాజకీయ నిరుద్యోగులతో టీటీడీ బోర్డును నింపేస్తున్నారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్కు లేదా అని నిలదీశారు. క్రైస్తవుడైన భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారని గగ్గోలు పెడుతున్నా సీఎం నిమ్మకు నీరెత్తినట్టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే తిరుపతి కొండ రాజకీయ వివాదాలకు, రాజకీయ నినాదాలకు నిలయంగా మారటం చాలా దురదృష్టకరమని వంగలపూడి అనిత అన్నారు.
వెంకన్నతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో జగన్ కు చాలా బాగా తెలుసు. అయినా జగన్ మళ్లీ వెంకన్నతోనే పెట్టుకుంటున్నారు. . కళంకితులు, క్రిమినల్స్, అన్యమతస్తులకు టీటీడీ బోర్డులో సభ్యత్వం ఇచ్చారని మండిపడ్డారు అనిత. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ బోర్డుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అందులో కొందరు వ్యక్తుల నియామకంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని బోర్డు సభ్యుడిగా ఎలా నియమిస్తారని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.