Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వారాహి యాత్రలో భాగంగా పలు ప్రాంతాలలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై దారుణమైన కామెంట్స్ చేస్తూ ఏపీ రాజకీయాలలో వేడి రాజేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వారాహి యాత్రను ఆయన వైజాగ్ నుంచే ప్రారంభించనున్నారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ముందుగా నిర్ణయించిన దారిలో కాకుండా వేరే మార్గంలో రావాలని పవన్‌కు పోలీసులు సూచించారు.ఎయిర్‌పోర్టు నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని చెప్పారు. ఎక్కడా రోడ్‌షో నిర్వహించొద్దని, అభివాదాలు కూడా చేయొద్దని స్పష్టం చేశారు. అయితే సాయంత్రం 5 గంటలకు జగదాంబ కూడలిలో నిర్వహించే సభకు మాత్రం అనుమతి ఇచ్చారు.
వారాహి యాత్రలో భాగంగా తొలి రెండు విడతల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించారు. మూడో విడతలో భాగంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. జగదాంబ సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. 14వ తేదీ దాకా విశాఖలోనే పవన్ ఉండే అవకాశం ఉంది. 15, 16 తేదీల్లో గ్యాప్ ఇచ్చి.. 17 వ తేదీ నుంచి యాత్రను మళ్లీ ప్రారంభిస్తారు. ఇవాళ సాయంత్రం జగదాంబ సెంటర్ లో వారాహి యాత్రలో భాగంగా సభ ను నిర్వహించనున్నారు. ఈ సభకు ముందుగా విశాఖ జిల్లాకు చెందిన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన చర్చించనున్నారు. మరో వైపు మాజీమంత్రి పడాల అరుణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
పవన్ కళ్యాణ్.. వైసీపీ గూండాలకి పాఠాలు చెబుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. సభలో పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖకి చేరుకున్న సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇదే సమయంలో జనసేన వీరమహిళలు తమ అధినాయకుడికి హారతులు పట్టారు. సాయంత్రం నగరంలోని జగదాంబ సెంటర్ లో మూడో విడత వారాహి యాత్ర మొదలుకానుంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నట్లు పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.