CM YS Jagan : ఏపీలో రాజకీయం రోజు రోజుకి చాలా వేడెక్కిపోతుంది. ఒకవైపు వైసీపీ నాయకులు మరో వైపు టీడీపీ, జనసేన అస్త్రాలు సంధిస్తూ రాజకీయం మరింత వేడెక్కేలా చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ సోలోగా బరిలోకి దిగుతుండగా, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటి చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వైసీపీని ఈ సారి కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని జగన్ తన ఎమ్మెల్యేలకు సూచించారు. అందుకోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని అన్నారు. చంద్రబాబు నా దృష్టిలో నథింగ్. నేను ఆలోచించే చెబుతున్నా. ఆయన నా దృష్టిలోనే లేడు. కాని ఆయన కొన్ని ప్రముఖ పత్రికలతో కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు.
మనం అలాంటి ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం. చేసిన పనిని ప్రతి ఒక్కరికి వివరించండి. మనం చేసినవి ప్రతి ఒక్కరికి తెలియజేయండి అని జగన్ అన్నారు. ఎమ్మెల్యేల ఇకనైనా పని తీరు మెరుగుపరచుకోవాలని.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వంపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో ఆర్డినేటర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పని తీరుపై చేసిన సర్వే నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు.
వచ్చే 9 నెలలు అత్యంత కీలకమని చెప్పిన.. 175కి 175 ఎమ్మెల్యే సీట్లు కచ్చితంగా గెలవాలని అన్నారు. పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను కొనసాగిస్తామని.. లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది లేదన్నారు. కొన్ని కోట్ల మంది పేద ప్రజలు మనపై ఆధారపడి ఉన్నారని.. అధికారంలో ఉంటేనే వారికి మంచి జరుగుతుందని చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నాలుగేళ్లలో రాష్ట్రంలో చాలా మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. అయితే, కొంత మంది వ్యతిరేక మీడియా ద్వారా మారీచుల్లా తమపై యుద్ధం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గత టీడీపీ సర్కారు పాలన, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలను నాడు- నేడు ద్వారా ప్రజల వద్దకు చేర్చాలని ఆయన సూచనలు చేశారు.