Balakrishna : టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు ప్రతిపక్షాలపై పంచ్‌లు వేస్తూ వారిని విమర్శిస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి.. అధికారంలోకి వచ్చాక ఎన్నో సంస్కరణలు తెచ్చారని ఆయన అన్నారు.. 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి.. పేదవాడి ఆకలి తీర్చిన మహానుభావుడు ఆయన అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరిలో ఆయన రాజకీయ చైతన్యం తెచ్చారని.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారని బాలయ్య స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ రాకముందే రాజకీయాలపై చాలామందికి ఆసక్తి ఉండేది .. వారందరికి ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారన్నారు. ఆయన అమలు చేసిన పథకాలు ఇప్పటికీ కూడా వాటిని చెప్పుకొని ఎన్నో రాజకీయ పార్టీలు పబ్బం గడపాల్సిందే అంటూ బాలయ్య సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజల ధనమాన ప్రాణ చోరకులు అని బాలకృష్ణ అన్నారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. బాదుడే బాదుడు పేరుతో అన్ని వస్తువుల ధరలు పెంచారని విమర్శించారు. నవరత్నాల కోసం ఎనిమిదిలక్షల కోట్లు అప్పు చేశారని ఆయ స్పష్టం చేశారు.. మూడు రాజధానుల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో కొత్త పరిశ్రమలు రావడం లేదంటూ, తెలుగువారి కలల రాజధాని అమరావతిని పక్కన పెట్టారన్నారు.
ఎన్నో మంచి పనులు చేశారు కాబట్టి.. ఎన్టీఆర్ మహానుభావుడు అయ్యాడని.. బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మహానుభావుడు అవ్వాలంటే మహోన్నత వ్యక్తిత్వం, ఆదర్శం వంటి మంచి లక్షణాలు ఉండాలని కానీ ఇప్పుడు వేరే రకం మహానుభావులను చూస్తున్నామని బాలయ్య విమర్శల వర్షం కురిపించారు. అన్ని వ్యవస్థలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. లక్షల కోట్ల భక్షకుడు, రావణ పాలన అన్నట్లుగా ఉందని కూడా ఆయన కామెంట్స్ చేశారు. దేశంలోనే నెంబర్ వన్‌గా గంజాయి, డ్రగ్స్‌లో మన రాష్ట్రాన్ని నిలబెట్టారని ఆరోపించారు. రైల్వే జోన్ అన్నారు.. ప్రత్యేక హోదా అన్నారు.. వాటిని ఎందుకు గాలికి వదిలేశారని బాలయ్య ప్రశ్నించారు. బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారయి.