Rs 2000 Note : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశ వ్యాప్తంగా చెలామణీలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30 వరకు గడువును కూడా విధించింది. ఈ సమయంలోగా ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో లేదా ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. ఇందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సుమారుగా 4 నెలల గడువు ఉంది కనుక రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ఈ సమయం సరిపోతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.
అయితే సెప్టెంబర్ 30వ తేదీ తరువాత రూ.2000 నోట్లకు ఏమవుతుంది ? వాటిని ఏం చేస్తారు ? వాటిని మళ్లీ వాడుకోలేమా.. అవి చెల్లవా..? అని అనేక మందికి సందేహాలు వస్తున్నాయి. అయితే దీనిపై కూడా ఆర్‌బీఐ తాను విడుదల చేసిన ప్రకటనలో స్పష్టతను ఇచ్చింది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ ఏమంటుందంటే.. సెప్టెంబర్ 30 తరువాత కూడా రూ.2000 నోట్లు చెలామణీలో ఉంటాయని స్పష్టం చేసింది. అవి చెల్లుతాయని చెబుతోంది. ప్రజలు వాటిని మామూలుగానే వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే వీలైనంత వరకు రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని, లేదంటే మార్చుకోవాలని కూడా ఆర్‌బీఐ సూచనలు చేసింది. కనుక సెప్టెంబర్ 30 తరువాత కూడా రూ.2000 నోట్లు చెల్లుతాయని స్పష్టతను అయితే ఇచ్చింది.
అయితే పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ఉన్నవారు లేదా భారీ ఎత్తున లావాదేవీలు నిర్వహించేవారు రూ.2000 నోట్లను పెద్ద ఎత్తున ఎలా మార్చుకుంటారు.. అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే దీనికి ప్రస్తుతం ఆర్‌బీఐ ఎలాంటి లిమిట్‌ను విధించలేదు. కానీ ఒక కస్టమర్ ఒకసారి బ్యాంకులో పది రూ.2వేల నోట్లను మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుందట. ఇలా చేస్తే ప్రజలకు ఇబ్బందేమీ కలగదు. కానీ భారీ ఎత్తున లావాదేవీలు నిర్వహించేవారికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక బ్లాక్ మనీ ఉన్నవారు అంత సులభంగా డబ్బును మార్చుకోలేరు. దీని వల్ల వారి గుట్టు రట్టవుతుందని.. అందుకనే రూ.2వేల నోట్లను విత్‌డ్రా చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే.