Mukesh Ambani : ఇటీవలి కాలంలో సెలబ్రిటీలకి బెదిరింపు కాల్స్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మెన్ ముకేశ్ అంబానీని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తమకు రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ముకేశ్ అంబానీకి మెయిల్ వచ్చిందని వెల్లడించారు. తమ వద్ద బెస్ట్ షూటర్స్ కూడా ఉన్నట్లు మెయిల్‌లో హెచ్చరించారని అధికారులు పేర్కొన్నారు. షాదాబాద్ ఖాన్ పేరుతో ఉన్న మెయిల్ నుంచి అక్టోబర్ 27వ తేదీన బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ పంపినట్టు చెబుతున్నారు.
రిలయన్స్ ఫౌండేషన్ ఆధీనంలో నడుస్తోన్న ఆసుపత్రికి బెదిరింపు ఫోన్ కాల్ అందిన కొద్దిరోజుల్లోనే ముఖేష్ అంబానీకి డెత్ మెయిల్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండు ఘటనలు ముంబైలో కలకలం రేపాయి. పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన నివాసానికి అదనపు భద్రతను కల్పించారు. గతంలో కూడా ముఖేష్ అంబానీకి బెదిరింపులు అందిన విషయం తెలిసిందే. 2021లో ఆయన నివాసం అంటాలియాకు అత్యంత సమీపంలో కారును పార్క్ చేసిన ఉదంతం అనేక మలుపులు తిరిగింది. ఆ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ఇది కేవలం గ్లింప్సెస్ మాత్రమే అనే బెదిరింపు లేఖనూ పోలీసులు ఆ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పుడు మరోసారి బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాము అడిగిన 20 కోట్ల రూపాయలను ఇవ్వకపోతే షూట్ చేసి చంపుతామంటూ అజ్ఞాత వ్యక్తులు ముఖేష్ అంబానీకి ఇ-మెయిల్ పంపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 27వ తేదీన ఈ ఈ-మెయిల్ ఆయనకు వచ్చింది. దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గమ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అన్నారు.