Roja : మిచౌంగ్ తుఫాన్ ఎంత ప్రళయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తుఫాను ప్రభావతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ నుండి తీవ్ర భారీ వర్షాలుకురిసాయి.. ఏపీ, చెన్నైలోను ఈ వర్షాలకి వణికిపోయారు. అయితే మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఓ పక్క నియోజకవర్గం ప్రజలు ముప్పుతిప్పలు పడుతుంటే ఆ మంత్రి మాత్రం జోరు వానలో రీల్స్ చేసుకుంటూ వివాదంలో చిక్కుకున్నారు.
నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే మంత్రి రోజా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సింది పోయి గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రతి ఇల్లు తిరుగుతూ అందర్నీ పలకరించారు. అదే సమయంలో జోరు వానలో రోజా చిందులు వేసిన వీడియోలు బయటకి రావడం, అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం జరిగింది. జోరున కురిసే వర్షంలో పుత్తూరు మున్సిపాలిటీ పిళ్లారిపట్టు సచివాలయం పరిధిలోని 5 వ వార్డు తాయిమాంబాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి రోజా నిర్వహించారు. ఓ వైపు వర్షం జోరున కురిస్తుండగా. అవ్వా తాతలు, అక్క చెల్లెలతో ఆప్యాయంగా పలకరిస్తూ వార్డులలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని రోజా నిర్వహించారు.
గ్రామ ప్రజలు వర్షం అని కూడా లెక్కచేయకుండా మంత్రికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రీల్స్ చేయడం మాత్రం స్థానికుల్లో ఉత్సాహం కనిపించినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి అయ్యుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో, అదీ వర్షంలో రీల్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తుపాను వల్ల ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మంత్రి మాత్రం గొడుగు తిప్పుతూ ఎంజాయ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీవీ 5 ఎడిటిర్ సాంబశివరావు రోజాని ఏకిపారేశారు. అందరు బాధపడుతున్న సమయంలో ఈవిడ ఎలా ఎంజాయ్ చేయగలుగుతుంది. ఎవరైన చనిపోతే జగన్ నవ్వుతారు. అసలు వీరికి ఏమైంది. వీళ్లకి ట్రైనింగ్ క్లాసులు ఇప్పించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.