Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టారు. ఆయన సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. చంద్రబాబుతో పొత్తుల విషయం గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చిన జనసేనాని తాను చనిపోవడానికి సిద్ధమై పార్టీ పెట్టినట్లు పవన్ అన్నారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు తన పక్కన ఎవరూ లేరని, తాను ఒక్కడినే ఉన్నా అన్నారు. మరణానికి సిద్ధపడే ఆ రోజు పార్టీ పెట్టానని, ఈ రోజు సత్యాన్ని ఆవిష్కరింపజేస్తున్నా అని అన్నారు. ఈ పోరాటంలో తనను పంచేసినా పర్లేదని, చైతన్యం లేకుండా పిరికితనంతో ఉన్న తెలుగుజాతిని మేల్కొలపడానికి తెగిస్తానని ఆయన అన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న ఓ పార్టీ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని, సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నానంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమేనని చెప్పారు.
తాను ఎప్పుడు భారతీయుడిగానే మాట్లాడుతానని, 389 మంది మేధోమథనం చేయడం వల్ల మన రాజ్యాంగం వచ్చిందని తెలియజేశారు. రాజ్యాంగాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని, సనాతన ధర్మం, తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తోందని పవన్ చెప్పుకొచ్చారు. కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుందని, ద్వేషం, దోపిడీ కొంతకాలమే ఉంటాయని అన్నారు. ధ్వేషంతో కూడిన వాదనలు కచ్చితంగా కనుమరుగవుతాయని, మార్పును అంగీకరించి, ధర్మాన్ని పాటించి ప్రేమతో ముందుకొచ్చే వ్యక్తులే సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతారని అభిప్రాయపడ్డారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్లే దేశంలో ఏకత్వం నిలబడింది.
సీఎం జగన్ కు అదో రకమైన మానసిక సమస్య ఉందని, దాన్ని పిచ్చి అంటారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మెడికల్ టీమ్ ను ఏపీకి పంపించి జగన్‌ను చెక్ చేయాలని కేంద్రాన్ని కోరతానని చెప్పారు. ఏదైనా ప్రశ్న అడిగితే, చేతిలో పేపర్ లేకపోతే సరిగ్గా సమాధానం చెప్పలేని వ్యక్తి జగన్ అని, మానసిక పరిస్థితి సరిగ్గా లేని అలాంటి వ్యక్తులు పరిపాలన చేయడానికి అనర్హులు అవుతారని భారత రాజ్యాంగంలోనే పేర్కొన్నారంటూ పవన్ సంచలనానికి తెరతీశారు. ఏపీని ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం కరెక్ట్ కాదంటూ పవన్ పేర్కొన్నారు. ముందు జగన్‌ని ఏపీ నుండి తరిమేసి ఆ తర్వాత ఎవరు సీఎం, ఏఏ పదవులు దక్కించుకోవాలి అనే దానిపై చర్చలు జరుపుతామని పవన్ అన్నారు.