Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఆయన వ్యాఖ్యలు వెనక ఉన్న మతలబు ఏంటే బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కౌశిక్ వ్యాఖ్యలపై దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా? లేక వ్యక్తిగతమా? చెప్పాలని నిలదీశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్ ఇవాళ అరికెపూడి గాంధీ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టవద్దని సూచించారు.
అరికెపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం పేరిట బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంతో తమకు తెలుసునని ఎద్దేవా చేశారు. తాము అన్నీ చేసే ఇక్కడి వరకు వచ్చామని వ్యాఖ్యానించారు.ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమైతే బీఆర్ఎస్ ఆయనను సస్పెండ్ చేయాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఎక్కడైనా ఇంట్లో చేస్తారా? అని నిలదీశారు. అసలు అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఏంటో మాకు తెలుసు, అన్నీ చేసే మేము ఇక్కడి వరకు వచ్చాం అని నాగేందర్ అన్నారు.
మరోవైపు నాకు దూకుడు ఎక్కువ ఉంటే.. దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ గోకుడు బంజేయాలని సూచించారు. సిగ్గు శరం లజ్జ మానం ఉంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఖైరతాబాద్‌లో ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. అప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజు నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.వారిలా దాడులు చేయడం తమకు పెద్ద విషయమేమీ కాదని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేయవద్దని.. వాళ్లు చేసిన తప్పులు మనం చేయవద్దని కేసీఆర్ అనడంతో సమన్వయం పాటిస్తున్నామని చెప్పారు.