ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 24వ మ్యాచ్‌లో అద్భుతం చోటు చేసుకుంది. పసికూన జట్టు అయినప్పటికీ.. లక్ష్యం స్వల్పంగానే నిర్దేశించినప్పటికీ.. జింబాబ్వే అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది. పాక్‌ను మట్టి కరిపించింది. ఆ జట్టుపై కేవలం 1 పరుగు తేడాతో గెలుపొందింది. జింబాబ్వే నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ తడబడింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. జింబాబ్వే జట్టు పరిణితి చెందిన టీమ్‌లాగా సమిష్టిగా ఆడారు. పరుగులు ఇవ్వడంలో పిసినారులుగా వ్యవహరించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్‌ను ఆడుకున్నారు. చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడి లేకుండా జింబాబ్వే అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలోనే పాక్ జట్టుకు జింబాబ్వే భారీ షాకిచ్చింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో షాన్ విలియమ్స్ 31 పరుగులు చేయగా.. మిగిలిన వారు ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీమ్ 4, షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడుతున్నట్లు కనిపించినా తరువాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. దీంతో చేయాల్సిన పరుగులు పెరిగిపోయాయి. అయితే చివర్లో టెయిలెండెర్లు పోరాటం చేసినా వృథా అయింది. పాక్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్ మెన్‌లలో షాన్ మసూద్ (44), మహమ్మద్ నవాజ్ (22) మినహా ఎవరూ రాణించలేదు. ఇక జింబాబ్వే బౌలర్లలో సికందర్ రాజా 3 వికెట్లు పడగొట్టగా బ్రాడ్ ఇవాన్స్‌కు 2 వికెట్లు దక్కాయి. అలాగే ముజర్‌బాని, జొంగ్వెలు చెరొక వికెట్ తీశారు.