YS Sharmila : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనుండగా, ఈ సారి ఎవరు గెలుస్తారు అనేది చర్చనీయాంశం అయింది. రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక.. ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ కూటమి) సరికొత్త జోష్ తో తాము సిద్ధమంటూ కదనరంగంలోకి అడుగేశాయి. అయితే సీట్ల ఎంపికపై కూడా బాగానే కసరత్తు నడుస్తుంది. ఇటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల సంగ్రామంలో స్పీడును పెంచాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.
వైఎస్ షర్మిలను పార్టీ చీఫ్ గా ప్రకటించిన నాటినుంచి దూకుడుగా ముందుకువెళ్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో అమలు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరిగా.. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పక్కా హామీలంటూ ఇటీవల విడుదల చేసింది. తాము ఎన్నికల్లో గెలిస్తే ఇవి పక్కాగా అమలు చేస్తామంటూ ఖర్గే సైతం ప్రకటించారు. అంతేకాకుండా.. ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. వైఎస్ షర్మిల ఎప్పటికైనా సీఎం అవుతారని చెప్పిన రేవంత్ రెడ్డి.. తనకు అండగా ఉంటానంటూ ప్రకటించారు.
కడప ఎంపీగా వివేకా సతీమణి సౌభాగ్యమ్మను బరిలోకి దింపాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే, సౌభాగ్యమ్మను కాంగ్రెస్ నుంచే పోటీ చేయించాలనే మరో ఆలోచన తాజాగా జరిగిన వివేకా సంస్మరణ సభలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం షర్మిలను కడప ఎంపీగా బరిలోకి దిగాలని సూచిస్తుండటంతో…వివేకా కుటుంబం నుంచి పోటీ ఉండదనే అంచనా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు షర్మిల ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ సూచిస్తుండడటంతో బరిలోకి దిగుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా విడుదల కానుంది. పులివెందుల నుంచి జగన్ పోటీ చేస్తుండంతో టీడీపీ అభ్యర్దిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు. దీంతో, షర్మిల ఎంపీగానే పోటీ చేస్తారా..లేక ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగుతారా అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.