YS Sharmila : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన ఈ ఫంక్షన్ లో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. షర్మిల ఆహ్వానం మేరకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా రాజారెడ్డి-అట్లూరి ప్రియ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు..పవన్ రాక సందర్భంగా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో ఒక్కసారిగా కోలాహలం ఏర్పడింది. ఆయనకు షర్మిల-అనిల్ దంపతులు స్వాగతం పలికారు. త్వరలోనే పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న రాజారెడ్డి-ప్రియ జోడీకి పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఈ ఎంగేజ్‌మెంట్‌లో వైఎస్ఆర్ కుటుంబంలోని విభేదాలు బయటపడ్డాయి. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు ఆహ్వానించిన షర్మిల.. తన అన్న వైఎస్ జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదు. కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జగన్, షర్మిల ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. షర్మిల ఆమె భర్త అనిల్ ఇద్దరూ జగన్‌ను పట్టించుకోలేదు. ఫోటో దిగేందుకు రావాలని జగన్ పిలిచినా షర్మిల, అనిల్ రాలేదు. ఆ పక్కనే నిల్చున్నారు. దాంతో బొకే ఇచ్చి నిమిషంలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు జగన్, భారతి. ఇక ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో జగన్ కంటే కూడా అత్యంత ప్రాధాన్యత దక్కిన వ్యక్తి కేవీపీ రాంచందర్ రావు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి ఆత్మలా ఈయనని పిలుచుకునేవారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడు.
కేవీపీనే మొదటగా స్టేజిపైకి రావటం.. ఆయన సమక్షంలోనే వేడుక ప్రారంభం కావటం జరిగింది. షర్మిల, విజయమ్మలు కూడా కేవీపీకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఈ నిశ్చితార్ధ వేడుకలో 150రకాల వంటకాలు వండినట్టు సమాచారం. ఆంద్ర, తెలంగాణ రుచులను మిక్స్ చేసి అతిధులకు వడ్డించారట. అమెరికాలో ఎంఎస్ చదివుకుంటున్న షర్మిల తనయుడు రాజారెడ్డి తెలుగమ్మాయి ప్రియతో ప్రేమలో పడ్డాడు. గత నాలుగేళ్లుగా ప్రేమలో వున్న వీరు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యారు. జనవరి 18న అంటే నిన్న గురువారం నిశ్చితార్థం జరుపుకున్న రాజారెడ్డి-ప్రియ జోడి ఫిబ్రవరి 17న పెళ్లిపీటలు ఎక్కనున్నారు.