YS Sharmila : ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం చాలా వేడెక్కుతుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితుడికే కడప ఎంపీ సీటు ఇచ్చారని మండిపడ్డారు. చిన్నాన్న వైఎస్ వివేకానందాను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని, హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. వివేకాను చంపించిన అవినాష్ కు జగన్ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయం కోసం వాడుకుందని, విమర్శించారు.
కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడానికి ఎంతో ఆలోచించానని షర్మిల తెలిపారు. తాను తీసుకున్న ఈ నిర్ణయంతో వైఎస్ కుంటుంబం చీలిపోతుందని తెలుసన్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. అప్పుడు షర్మిల చెల్లెలు కాదు బిడ్డ అన్నారని తెలిపారు. కానీ సీఎం అయిన తర్వాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులకు జగన్ మద్దతుగా ఉన్నారని తెలిపారు. నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారని వారికి శిక్ష పడకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. బాబాయ్ వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ ఇవ్వడం జీర్ణించుకోలేకపోయాయని ఆవేదన వెలిబుచ్చారు.
2019 ఎన్నికల్లో వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని షర్మిల ఆరోపించారు. తాను ఎంపీగా పోటీ చేయాలనేది వివేకా ఆఖరి కోరిక అని వెల్లడించారు. బాబాయ్ ఆకాంక్షను తీర్చడానికే కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. తన సోదరి వైఎస్ సునీతా రడ్డి న్యాయం కోసం పోరాటం చేస్తోందన్నారు. వివేకా హత్య కేసులో దోషిగా ఉన్న అవినాష్ రెడ్డిని పార్లమెంట్ లో అడుగుపెట్టకుండా చేయడమే తన లక్ష్యమని షర్మిల స్పష్టం చేశారు. ప్రజలు తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. షర్మిల రాజకీయ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ ప్రార్థన చేశారు.