YS Sharmila : సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ.. ఆడపడుచులంతా సంబురంగా చేసుకునే వేడుక.. బంధాలు, అనుబంధాలను గుర్తు చేస్తూ.. ప్రకృతిని ఆరాధిస్తూ.. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఓ అద్భుత పర్వం. ఎంగిళిపూలతో ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు 9రోజుల పాటు గౌరమ్మను పూజించే పూల పండుగ రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేస్తూ హోరెత్తించారు. రంగురంగుల పూలతో పేర్చి బతుకమ్మను పేర్చి గౌరమ్మను మధ్యలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయాలు, బొడ్రా యిల వద్ద మహిళలు బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు. వైఎస్ షర్మిళ కూడా లోటస్ పాండ్‌లో మహిళలతో కలిసి ఆడిపాడింది. పాటలు పాడుతూ, సరదాగా ఆటలు ఆడుతూ సందడి చేశారు. ప్రస్తుతం షర్మిళకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పండుగ.. దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ ఇది. ప్రకృతిని ప్రేమించడం, పూజించడమే బతుకమ్మ. పచ్చదనంతో మమేకమై బతకాలని చల్లగా ఆశీర్వదించే పండుగ ఇది. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆటాపాటాతో ఝల్లుమంది.
ప్రకృతితో మమేకమై ఆడి పాడడమే బతుకమ్మ. పూలతో ప్రకృతిని పూజించడమే బతుకమ్మ పండుగ. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ పండుగతో బిజీగా ఉన్నారు. ఇక షర్మిల విషయానికి వస్తే.. అసెంబ్లీ బరిలో పోటీ స్థానంపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచే షర్మిల ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు. గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లోటస్ పాండ్‌లో వైఎస్సార్టీపీ కీలక నేతలతో షర్మిల అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశంపై పార్టీ క్యాడర్‌తో చర్చిస్తున్నారు.