Yarlagadda Venkat Rao : గన్నవరం రాజకీయాలు మారుతున్నాయి. ఇటీవలే వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించిన యార్లగడ్డ వెంకట్రావ్… హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ కావడం చర్చనీయాంశం అయింది. పార్టీలో చేరికతో పాటు స్థానిక రాజకీయాలపై చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. ఇక ఈ నెల 22న గన్నవరంలో జరిగే సభలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం అధికార పార్టీకి షాక్ ఇస్తోంది.. తాజాగా వెలువడిన పంచాయి, వార్డు ఉప ఎన్నికల్లోనూ టీడీపీ జెండా రెప రెపలాడడం.. వైసీపీకి పెద్ద షాకే అని చెప్పాలి.. మరోవైపు పార్టీలో రోజు రోజుకూ రెబల్స్ పెరడం మరో ఇబ్బందికర పరిస్థితి.
ఈ దూకుడును ఇలాగే కంటిన్యూ చేయలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరు అన్నదానిపై గందరగోళం కనిపించింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి దూరమైనప్పటి నుంచి.. అక్కడ ఎవరిని పోటీలో నిలపాలి అన్నదానిపై తర్జనభర్జన కనిపించింది. కానీ ఇప్పుడు టీడీపీ అభ్యర్థి దొరికినట్టే.. ఎందుకంటే వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అటు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిని వల్లభనేని వంశీ గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే ఈ సారి తలపడుతున్నారు.. కానీ పార్టీలు మారారు.. బొమ్మ రివర్స్ అవ్వడం అంటే ఇదే..
చంద్రబాబుతో భేటి తర్వాత యార్లగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయానని గుర్తు చేశారు. ఏ నేత చేయలేని విధంగా గన్నవరంలో పాదయాత్ర కూడా చేశానని అన్నారు. తన వెంట వచ్చినవారికి కనీసం ఏ చిన్న పదవి కూడా ఇప్పించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. “పార్టీ ఆదేశాల మేరకు నడుస్తా అని చంద్రబాబుతో చెప్పా. పార్టీలో చేరికపై చర్చించాను. డబ్బుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ప్రజాసేవ కోసమే వచ్చాను. గతంలో నేను ఎప్పుడు చంద్రబాబును విమర్శించలేదు. పోటీ ఎక్కడ్నుంచి పోటీ చేయమంటే అక్కడ్నుంచి చేస్తాను. చేరికపై అన్ని వివరాలను త్వరలోనే చెబుతాను” అని వ్యాఖ్యానించారు.